మరో భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నో ఏండ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న అమన్‌గల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. మొత్తం 424 ఎకరాల 31 గుంటల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని తెలంగాణ ఫారెస్ట్ చట్టం-1967లోని సెక్షన్ 15 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చి 9న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తై, అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సీ.సువర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో ఆ అటవీ భూములకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ లభించనుందని ఆమె చెప్పారు.
ఈ విస్తీర్ణంలో భాగమైన సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 201/1లోని 102 ఎకరాలు చాలా కాలంగా న్యాయ వివాదంలో ఉంది. ”సాహెబ్‌నగర్ కలాన్ కేసు”గా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారం దీర్ఘకాలం పాటు వివిధ న్యాయస్థానాల్లో విచారణకు వచ్చింది. అటవీ అధికారుల కృషి, ప్రభుత్వ మద్దతుతో చివరకు అటవీ శాఖ వాదనను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చింది. తద్వారా అటవీ భూములను ఆక్రమణలు, అనధికార హక్కుల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిందని సువర్ణ తెలిపారు. ఈ తీర్పుతో ఆ భూములపై ప్రభుత్వ హక్కులు మరింత బలపడ్డాయని ఆమె పేర్కొన్నారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో పచ్చని ప్రదేశాల అవసరం పెరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పార్క్ నగర ప్రజలకు ముఖ్యమైన గ్రీన్ స్పేస్‌గా మారనుందన్నారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు, కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు ప్రజలకు అనువైన ప్రదేశంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్టు సువర్ణ వెల్లడించారు.
గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్‌ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



