• ఈనెల 24న కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలి
• సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వీరన్న
నవతెలంగాణ -పెద్దవంగర
ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈనెల 24న కలెక్టరేట్ ముట్టడి కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావొస్తున్న రాష్ట్రంలోని పేద ప్రజల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పత్తి రైతులు అరిగోస పడుతూన్నారని, కొనుగోళ్లలో షరతులు విధించడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆడబిడ్డలకు 2500, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పెంపు, జీవన భృతి, నిరుద్యోగ భృతి, రైతులకు బోనస్ వంటి పథకాలు అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరు గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంయుక్త మండలాల కార్యదర్శి చింత నవీన్, నాయకులు సంతోష్, ఎల్లయ్య, కుమారస్వామి, మల్లయ్య, భిక్షం, అబ్బన్న తదితరులు పాల్గొన్నారు.



