నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించిన కేటీఆర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్ బయల్దేరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించామన్నారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే తమకు మైకు ఇవ్వరని చెప్పారు. అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్‌క్లబ్‌లోనైనా చర్చకు రావాలని చెప్పామన్నారు. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించామన్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. ముఖ్యమంత్రి రాకుంటే మంత్రులైనా చర్చకు రావాలన్నారు. సీఎం ఇవాళ హాజరుకాకుంటే.. మరో రోజు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయనకు వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలన్నారు.
అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడనిస్తే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తప్పుకుంటే.. కేసీఆర్ అభివృద్ధి చేసి చూపిస్తారని కేటీఆర్ అన్నారు. కాగా, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ వద్దకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ప్రెస్‌క్లబ్ వద్ద పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. వచ్చినవారిని వచ్చినట్లు అక్కడినుంచి తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచారు.