- Advertisement -
- – ఎరువుల సరఫరాపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష
నవతెలంగాణ -పరకాల - నియోజకవర్గ రైతులకు యూరియా ఎరువుపై ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి రైతుకు అవసరమైన యూరియా సమయానికి అందుబాటులో ఉండేలా చూడాలని, మండలాల వారీగా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
- పిఎసిఎస్ సొసైటీలు, ప్రైవేట్ డీలర్లు వ్యవసాయ శాఖ ఆధీనంలోనే పంపిణీ జరగాలని స్పష్టం చేశారు.రైతులకు స్టాక్‌కు అనుగుణంగా టోకెన్ విధానంలో బస్తాలు అందించాలన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వివరాలపై పూర్తి స్థాయి నివేదిక తక్షణమే సమర్పించాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ను ఆదేశించారు. మనకు రావాల్సిన కోటాతోనే సరఫరా జరుగుతోందని, యూరియా కొరతపై కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.రైతులకు సకాలంలో ఎరువులు అందించడంపై ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో నారాయణ, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -