Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమెట్రోపై సర్కారు పట్టు..!

మెట్రోపై సర్కారు పట్టు..!

- Advertisement -

సాంకేతికత అధ్యయనం కోసం రెండు కమిటీలు ఏర్పాటు
ముంచుకొస్తున్న స్వాధీన గడువు
ఎల్‌ అండ్‌ టీ సాంకేతికత, ఇతర రాష్ట్రాల్లోని మెట్రోరైల్‌ టెక్నాలజీలపై వేర్వేరుగా నివేదికలు ఇవ్వాలని సర్కారు ఆదేశాలు

హైదరాబాద్‌ : మెట్రో రైల్‌ నిర్వహణ, సాంకేతిక అంశాల అధ్యయనానికి రెండు కమిటీలను ఏర్పాటు చేస్తూ హైదరాబాద్‌ మెట్రోరైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ నియమికాన్ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మొదటి దశ (ఫేజ్‌-1)ను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, మెట్రోకు సంబంధించిన నిర్వహణ, సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. మొదటి దశలో ఎంపికైన ఏజెన్సీలకు కేవలం ఆర్థిక, న్యాయపరమైన అంశాలపైనే అవగాహన ఉంది. కానీ మెట్రో వంటి అత్యాధునిక వ్యవస్థను నడపాలంటే సాంకేతిక లోతుపాతులు తెలియాలి.

అందుకే సాంకేతిక సమగ్ర పరిశీలన (టెక్నికల్‌ డ్యూ డిలిజెన్స్‌ ఆడిట్‌)ను క్రాస్‌ చెక్‌ చేయడం కోసం ఈ రెండు కమిటీల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుత మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్థిక, న్యాయపరమైన అంశాలను పరిశీలించే ఏజెన్సీలకు, దాని సాంకేతిక భాగాలను అంచనా వేసే నైపుణ్యం లేకపోవచ్చని ప్రభుత్వం గుర్తించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నట్లు ఓ ఆంగ్లపత్రిక కథనంలో వెల్లడించింది. మొదటి కన్సల్టెంట్‌ అయిన ‘నాన్‌-టెక్నికల్‌ సోవరిన్‌ ఆడిట్‌’ కోసం టెండర్‌ ఖరారు చేసే దశలో షార్ట్‌లిస్ట్‌ చేయబడిన ఎస్బీఐ క్యాప్‌, పీఎన్బీ వంటి ఏ ఏజెన్సీలకు కూడా సాంకేతిక అంశాలను అంచనా వేసే సామర్థ్యం లేదని స్పష్టమైంది. దీనికి మెట్రో రైల్‌, రైల్వే టెక్నాలజీలో అనుభవం ఉన్న సిబ్బంది అవసరమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రైలు పెట్టెలు, ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌, సిగలింగ్‌, ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ మొదలైన వాటిని అంచనా వేయడానికి మెట్రో రైల్‌ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారితో వేర్వేరుగా రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ), రైట్స్‌ (ఆర్‌ఐటీఈఎస్‌), నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) వంటి పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విదేశీ నిపుణులైన కన్సల్టెంట్ల భాగస్వామ్యం వైపు కూడా దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. 2026 మార్చి 31 కంటే ముందే ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి గడువు విధించారు. ఇందులో భాగంగా ఫేజ్‌-1 ఆర్థిక, సాంకేతిక అంశాల పరిశీలనను 100 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. కాగా.. సమగ్ర ఆడిట్‌కు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నా రు. ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌నకు సంబంధించి అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నాయి.

కన్సల్టెంట్‌ ఏజెన్సీలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. తద్వారా ఇవి భవిష్యత్తులో చట్టపరమైన అడ్డంకులుగా మారకుండా ఉంటాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం ఎల్‌అండ్‌టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. అప్పుతో సహా రూ.15,000 కోట్ల చెల్లింపును ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను తన ఆధీనంలోకి తీసుకునే ముందే సెటిల్‌ చేయాల్సి ఉంటుంది. సుమారు రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2లో ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యం కావడానికి నిరాకరించింది. దీంతో ఫేజ్‌-1ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 200 ఎకరాల భూమిని నగదుగా మార్చుకోవడం, అలాగే ఫేజ్‌-1 అభివృద్ధి చేసిన నాలుగు మాల్స్‌తో సహా వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

69.2 కిలోమీటర్ల మెట్రో ఫేజ్‌-1, కొత్తగా రాబోతున్న 76.4 కిలోమీటర్ల ఫేజ్‌-2 వేర్వేరుగా ఉంటే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ రెండింటినీ కలిపి ఒకే వ్యవస్థగా నడపాలని కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. రెండో ప్రాజెక్టు ముందుకు సాగడంలో ఎల్‌అండ్‌టీ కొర్రీలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌-1ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎల్‌అండ్‌టీకి తెలంగాణ ప్రభుత్వం రూ.2,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మిగితా రూ.13,000 కోట్ల అప్పు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. అనంతరం ఎల్‌అండ్‌టీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టు ప్రభుత్వపరం కానుంది. ఈ అధికారిక స్వాధీన ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గడిచిన 2024-25లో హైదరాబాద్‌ మెట్రో ఆదాయం రూ.1,108 కోట్లుగా ఉంది. ప్రతీ రోజు 5.63 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం అప్పు రూ.13,000 కోట్లుగా ఉంది. కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రూ.6,600 కోట్ల నష్టాలను చవి చూసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -