Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంప్రభుత్వం రాజ్యాంగ విలువలు కాపాడాలి

ప్రభుత్వం రాజ్యాంగ విలువలు కాపాడాలి

- Advertisement -

మైనారిటీలపై దాడుల్లో నిందితులను శిక్షించాలి
ఉపాధి హమీ రద్దుతో పేదల హక్కులు నిర్వీర్యం లేబర్‌ కోడ్‌లు పెట్టుబడిదారుల కోసమే
బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్‌ దురదృష్టకరం: వెనిజులాపై అమెరికా చర్యలు, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు పరిణామాలపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పందించింది. దేశరాజధాని న్యూఢిల్లీలో సమావేశమైన పార్టీ పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశంలో మైనారిటీ లపై దాడులు, ఉపాధి హామీ చట్టం రద్దు, లేబర్‌కోడ్‌ నోటిఫికేషన్, అసోంలో దాడులు, లైంగికదాడి కేసులో నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్‌, ఆరావళి పర్వతాల అంశం, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు, వెనిజులాపై అమెరికా దూకుడు చర్యలు వంటి అంశాలపై తన ఆందోళనను వ్యక్తం చేసింది.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం( ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో బలహీనమైన వీబీ-జీ రామ్‌ జీని తీసుకొచ్చింది. ఇది గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తున్న చర్యగా సీపీఐ(ఎం) అభివర్ణించింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఆర్థిక భారం మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాల పైకి మళ్లించబడిందని పేర్కొన్నది. అయితే అమలు విషయంలో మాత్రం రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలూ ఇవ్వలేదని వివరించింది. కోట్లాది మంది గ్రామీణ కార్మికుల ప్రయోజనాలకు తీవ్రంగా హానికరమైన ఈ బిల్లును.. పార్లమెంటులో ఉన్న తన సంఖ్యా బలాన్ని ఉపయోగించుకొని కేంద్రం ఆమోదింపజేసుకున్నదని పేర్కొన్నది. ఈ మార్పును వ్యతిరేకిస్తూ వివిధ ప్రజా సంఘాలు చేపడుతున్న పోరాటాలకు సీపీఐ(ఎం) తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ పోరాటాల్లో పార్టీ నేరుగా పాల్గొని, వాటిని మరింత బలోపేతం చేస్తుంది.

ఉన్నావ్‌ లైంగికదాడి కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్‌
ఉన్నావ్‌ బాలికపై లైంగికదాడి ఘటన కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో బాధితురాలు.. తనపై, ఇతర సాక్షులపై ప్రభావం చూపేందుకు సెంగార్‌ చేసిన వివిధ రకాల హింసాత్మక, బెదిరింపు ప్రయత్నాలను వెల్లడించింది. అంతేకాకుండా బాధితురాలి తండ్రిని పోలీస్‌ కస్టడీలో హత్య చేసిన కేసులో కూడా సెంగార్‌ దోషిగా తేలాడు. ఇంత తీవ్రమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కోర్టు బెయిల్‌ ఇవ్వడం దురదృష్టకరమని పొలిట్‌బ్యూరో అభిప్రాయ పడింది. ఈ బెయిల్‌ ఉత్తర్వులు న్యాయవ్యస్థపై మచ్చగా నిలుస్తాయనీ, న్యాయం కోసం పోరాడుతున్న బాధితులలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహి ళలు, దళితులు, ఆదివాసీలపై హింసా త్మక ఘటనలు విపరీతంగా పెరిగాయని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. నింది తులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక పోవడం, పరోక్షంగా వారికి మద్దతు ఇవ్వడం వల్ల ఇలాంటి నేరస్తులు మరింత ధైర్యాన్ని పొందుతున్నారని విమర్శించింది. ఇది ప్రస్తుత పాలనా వ్యవస్థలోని మహిళా, దళిత వ్యతిరేక, మనువాద ఆలోచనా ధోరణికి ప్రతిబింబమని స్పష్టం చేసింది.

ఆరావళి విధ్వంసం
ఆరావళి నిర్వచనానికి ఇటీవల బీజేపీ ప్రభుత్వం చేసిన మార్పు ప్రతిపాదనలు, వాటిని సుప్రీం కోర్టు ఆమోదించడంతో ఈ పర్యా వరణపరంగా అత్యంత సున్నితమైన పర్వత శ్రేణుల దోపిడీపై తీవ్రమైన ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ మార్పులు ఆరావళి ప్రాంతాల్లో పర్వతాలను నాశనం చేస్తూ, సున్నితమైన పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేసే గనుల తవ్వకాలు, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలను చట్టబద్ధం చేయడానికి ఉద్దేశించినదిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై ఇచ్చిన వివరణలు విశ్వాసాన్ని కలిగించేవిగా లేవు. పర్యావరణ మంత్రిత్వ శాఖ విధానాల్లో మౌలికమైన మార్పులు జరగకపోతే, ఆరావళి పర్వతాలకు ఉన్న అసలు నిర్వచనాన్ని పునరుద్ధరించకపోతే ఈ పర్వత శ్రేణులకు వాస్తవమైన రక్షణ లభించదని పేర్కొన్నది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై ఆందోళన
బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. మతపరంగా మైనారిటీలైనవారిపై దాడులకు అడ్డుకట్ట వేయడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. అలాగే మత, మూఢవాద శక్తులు శిక్షల భయం లేకుండా పని చేయడానికి అవకాశం ఇస్తోంది. ఇటీవలి ఘటనలో ఒక హిందూ యువకుడిని సజీవదహనం చేయడం, సాంస్కృతిక సంస్థలు, మీడియాపై దాడులు జరగడం తీవ్రంగా ఖండించదగిన చర్యలుగా పొలిట్‌బ్యూరో పేర్కొన్నది. ఇలాంటి పరిణామాలు దేశ భద్రతకు, ఐక్యతకు శుభసూచకాలు కావని స్పష్టం చేసింది. విభజన శక్తులను అణచివేయడానికి, మైనారిటీల హక్కులను రక్షించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

మైనారిటీలపై దాడులు
క్రిస్మస్‌ సందర్భంగా హిందూత్వ శక్తులు క్రైస్తవులుపై జరిపిన దాడులు గురించి సీపీఐ(ఎం) ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భజరంగ్‌దళ్‌, ఇతర హిందూత్వ సంస్థలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రైస్తవులపై దారుణంగా దాడులు చేస్తూ, క్రిస్మస్‌ వేడుకలకు అంతరాయం కలిగించటాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా స్పందించకపోవడం ద్వారా ఈ దాడులకు పరోక్ష మద్దతు ఇస్తున్నదని ఆరోపించింది. లౌకిక దేశాన్ని నిర్వీర్యం చేసి, హిందూ దేశంగా మార్చాలనే ఆరెస్సెస్‌-బీజేపీ విధానంలో ఇది భాగమని పేర్కొన్నది. ఈ దాడులను పొలిట్‌బ్యూరో ఖండించింది. ప్రభుత్వం రాజ్యాంగం విలువలను కాపాడాలని డిమాండ్‌ చేసింది. ఈ దాడులకు పాల్పడినవారిని తక్షణమే పట్టుకొని శిక్షించాలి.

లేబర్‌ కోడ్‌లతో కార్మిక వ్యతిరేక విధానాలు
కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్రం ముందుకెళ్తున్నది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. నాలుగు లేబర్‌ కోడ్‌లను నోటిఫై చేసింది. ఈ కార్మిక చట్ట సంస్కరణలు ప్రస్తుత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న పెట్టుబడిదారుల మిత్రులకు ఇచ్చిన కానుకలాంటివని పొలిట్‌బ్యూరో పేర్కొన్నది. వీటి వల్ల కార్మికుల హక్కులు దెబ్బతిని, వారి ఉపాధి భద్రత మరింత బలహీనమ వుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్పులకు వ్యతిరేకంగా దేశం లోని కార్మిక వర్గం ఇప్పటికే నిరసన ఉద్యమాలకు సిద్ధమవు తోంది. ఈ పోరా టానికి సీపీఐ(ఎం) తన సంపూర్ణ మద్ద తును ప్రకటిస్తూ.. ఇందులో క్రియాశీలంగా పాల్గొంటామని వివరించింది.

వెనిజులాపై అమెరికా చర్యలకు ఖండన
వెనిజులాపై అమెరికా దౌర్జన్యాన్ని, మిలిటరీ దాడికి దాని ప్రణాళికలను పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. తాజాగా ఆమోదించిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహం ద్వారా.. లాటిన్‌ అమెరికా ప్రాంతంలో మోన్రో సిద్ధాంతాన్ని అమలు చేయాలనే ఉద్దేశం స్పష్టంగా వ్యక్తమవుతోందని పేర్కొన్నది. వెనిజులాపై మాత్రమే కాకుండా మొత్తం లాటిన్‌ అమెరికా ప్రాంతంపై జరుగుతున్న అమెరికా దౌర్జన్యానికి వ్యతిరేకంగా అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా నిలబడాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. దేశ ప్రజలందరికీ పార్టీ పొలిట్‌బ్యూరో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించడానికి, భారత్‌ను ‘హిందూ దేశం’గా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రజల ఐక్యపోరాటాలే ఏకైక మార్గమని స్పష్టం చేసింది. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తదుపరి సమావేశం జనవరి 16-18 మధ్య కేరళలోని త్రివేండ్రంలో జరగనున్నదని పేర్కొన్నది.

అసోంలో దాడులు ‘డబుల్‌ ఇంజిన్‌’ ఫలితమే
అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్‌ జిల్లాలో చోటు చేసుకున్న హింసపై పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ హింసలో ఇద్దరు మృతి చెందగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. జాతి ఆధారంగా ఏర్పడిన వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఈ దుర్భర పరిణామం అసోంలో ఉన్న ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వ విధానాల ఫలితమేనని పొలిట్‌బ్యూరో పేర్కొన్నది. జాతి విభేదాలను నియంత్రించకుండా పెరిగేలా చేయడం ద్వారా సమాజంలో విభజనకు ప్రభుత్వం దారితీసిందని విమర్శించింది. ఇది భూముల నుంచి ప్రజలను తరిమివేసే దూకుడు విధానాల వల్ల ఏర్పడిన పరిస్థితి అని పొలిట్‌బ్యూరో పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -