నవతెలంగాణ – గన్నేరువరం: సర్కారు దావకాన (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) మండల కేంద్రంలో నే నిర్మించాలని వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరు సురేష్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ భవనాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్లయితే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల కేంద్రానికి దూరంగా గుట్టల్లో చెట్లల్లో నిర్మించడం తగదని సూచించారు. విజ్ఞప్తి దీక్షతో గన్నేరువరం గ్రామ ప్రజల ఆకాంక్షను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలిపే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ నాయకులు దీక్షకు అనుమతి ఇవ్వకుండా చేయడం తగదని అన్నారు.
ప్రజా పాలన పేరుతో ప్రతిపక్షాలపై నిర్బంధం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు దావకాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆలోచించాలని సూచించారు. లేని పక్షాన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నేరువరం గ్రామం నుండి సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఆస్పత్రి నిర్మాణాన్ని ఇప్పుడు నిర్మిస్తున్న ప్రదేశంలో పూర్తి కాకుండా అవసరమైతే కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తానని అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఆస్పత్రి నిర్మాణం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.