Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలి

మహిళా హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలి

- Advertisement -

ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మహిళా హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలని ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి డిమాండ్‌ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25- 28 తేదీల్లో హైదరాబాదులో జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతన్నాయనీ, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ దాడుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఇటీవల జరిగిన దాడుల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసిఫాబాద్‌ జిల్లాలో నిండు గర్భిణిని కులాంతర వివాహం చేసుకున్నదనీ, తక్కువ కులమని భర్త లేని సమయంలో మామ కత్తితో కడుపుపై, గొంతుపై కోసి హత్య చేసిన ఘటన చాలా అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

భిన్నత్వంలో ఏకత్వం కలిగి మతసామరస్యానికి బాటలు వేసిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరువు హత్యలు గడిచిన పదేండ్లలో పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా పిల్లలమర్రిలో జరిగిన ఘటన, వికారాబాద్‌ జిల్లా కులాంతర వివాహం చేసుకుని హైదరాబాదులో బ్రతుకుతున్న జంటను విడదీసి గర్భిణీని హత్య చేసిన ఘటనతో పాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వరుస ఘటనలు జరిగినా ప్రభుత్వం స్పందించి చట్టం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ అంశాలతో పాటు మద్యం, భ్రూణ హత్యలు, మైక్రో ఫైనాన్స్‌ తదితర అంశాలపై మహాసభల్లో చర్చించబోతున్నట్టు తెలిపారు. ఈ మహాసభలను హైదరాబాద్‌ ప్రజానీకం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణ జ్యోతి, సహాయ కార్యదర్శి కే.ఎన్‌.ఆశాలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -