Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం మాట నిలుపుకోవాలి

ప్రభుత్వం మాట నిలుపుకోవాలి

- Advertisement -

కేజీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న 
నవతెలంగాణ -పెద్దవంగర
గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన మాట వెంటనే నిలుపుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న, జిల్లా అధ్యక్షుడు యమగాని వెంకన్న అన్నారు. మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభ ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేజీకేఎస్ రాష్ట్ర సలహాదారులు గునిగంటి మోహన్ తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోని గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం, మంత్రులను ఎన్నిసార్లు కలిసిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‌ ఎక్స్గ్రేషియా బాధితులు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టినా, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ప్రమాదకరమైనప్పటికీ బతుకుదెరువు కోసం గీత వృత్తిని కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద దిక్కు దూరమైతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. ఏళ్ల తరబడి గీత కార్మికులకు చెల్లించాల్సిన ఎక్స్గ్రేషియా పెండింగ్ లో ఉందని, ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం ఇస్తున్న కాటమయ్య రక్షణ కవచాలు ఏడాది గడిచినా, ఇరవై వేలు మించలేదని తెలిపారు. ఈ విధంగా పంపిణీ చేస్తే పదేళ్లు గడిచిన కాటమయ్య రక్షణ కవచాలు అందించలేరని పేర్కొన్నారు. ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానం మేరకు రూ. 4000 పెన్షన్ చెల్లించాలన్నారు. ఎక్సిగ్రేషియా 10 లక్షలకు, మద్యం షాప్ టెండర్లలో 25 శాతం పెంచాలన్నారు. సాఫ్ట్ డ్రింక్ లను ఉత్పత్తి చేసే బడా కార్పొరేట్ కంపెనీలు కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దండుకుంటున్నాయని ధ్వజమెత్తారు. పక్కా ఆర్గానిక్, ప్రకృతి పానీయం నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదు అని ప్రశ్నించారు? ఇన్ని ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు 

ఒక్క పథకమైనా గీత కార్మికుల సంక్షేమానికి ప్రవేశ పెట్టిందా అని నిలదీశారు. పెంచిన జీఎస్టీని తగ్గించి, ప్రజలకు మేలు చేశామని కేంద్రం చెప్పుకోవడం సరికాదన్నారు.‌ గీత వృత్తిని ఆధునీకరించి, నీరా, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.

కేజీకేఎస్ మండల కమిటీ ఎన్నిక

కల్లుగీత కార్మిక సంఘం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.‌ మండల అధ్యక్షుడిగా అనపురం చంద్రమౌళి, ఉపాధ్యక్షుడిగా బీసు వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా కొయ్యడి యాకయ్య, గౌరవ అధ్యక్షుడిగా బొమ్మెర వెంకన్న, సలహాదారుగా బీసు యాదగిరి, సహాయ కార్యదర్శిగా ఎరుకుల సమ్మయ్య,కోశాధికారిగా బొమ్మెర సోమయ్య, సభ్యులుగా మద్దెల గురువయ్య, ముత్యం సోమయ్య, తండాల సంపత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తొర్రూరు మండల గౌరవ అధ్యక్షుడు నలమాస శ్రీనివాస్, తొర్రూరు మండల ప్రధాన కార్యదర్శి దీకొండ మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -