గ్రామీణ వ్యవసాయ పేదల సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి
అడ్డమీది కూలీలకు ప్రభుత్వమే పనులు కల్పించాలని గ్రామీణ వ్యవసాయ పేదల సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డ దగ్గర గ్రామీణ వ్యవసాయ పేదల సంఘము, అడ్డమీది కూలీల సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి చుట్టూ గ్రామాల నుంచి వనపర్తి పట్టణానికి పని కోసం వచ్చిన కూలీలకు ప్రభుత్వమే పనులు కల్పించాలని, ప్రతికూలికి లేబర్ కార్డు ఇవ్వాలని ఆడ,మగ కూలీ రేటు తేడా లేకుండా ప్రతి కూలీకి కనీసం రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎం ఆంజనేయులు గ్రామీణ వ్యవసాయ పేదల సంఘం జిల్లా కార్యదర్శి, అడ్డమీది కూలీల సంఘం జిల్లా కన్వీనర్ శాంతమ్మ మాట్లాడుతూ.. వనపర్తి పట్టణంలో చుట్టూ ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలొ కలపడం మూలంగా చుట్టు గ్రామాల ఉన్న పేదలకి మరియు వనపర్తి పట్టణంలో కూలీ పేదలు ఉపాధి పనులకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు ఉపాధి పని పెట్టడం లేదు. మరోవైపు వ్యవసాయంలో యంత్రాలు రావడం, కలుపు నివారణ మందులు రావడం, పట్టణాలలో ఇండ్ల నిర్మాణం ఇతరత్ర పనులను యంత్రాలతో నడవడం మూలంగా పనులు చేసుకోవడానికి పనులు కూడా దొరకని పరిస్థితి నేడు నెలకొని ఉందన్నారు.
వనపర్తి పట్టణానికి సుదూర గ్రామాల నుంచి వస్తున్న పేదలకు మరియు వనపర్తి పట్టణంలో ఉన్న పేదలకి ప్రభుత్వమే బాధ్యత వహించి రోజువారీగా పనులు కల్పించాలని, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి కూలి మనిషికి కనీసం రోజు కూలి రూ.800 ఇవ్వాలని, లేబర్ కార్డు ప్రభుత్వమే మంజూరు చేసి ఇవ్వాలని తదితర డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వము మరియు జిల్లా యంత్రాంగము వనపర్తి పట్టణానికి పనుల కోసం వచ్చే ప్రతి కూలికి పనులు కల్పించని యెడల కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ, లేబర్ అడ్డ మీద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లక్ష్మీ, చిట్టెమ్మ, పెంటయ్య,వెంకట్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.