Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుల దురహంకారహత్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

కుల దురహంకారహత్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

- Advertisement -

– 2024 జనాభా లెక్కల ఆధారంగా
– ఎస్సీ ఎస్టీలకు పంచాయతీ రిజర్వేషన్లను ప్రకటించాలి
– నేడు రాజ్యాంగ దినోత్సవ సభలు : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో జరుగుతున్న వరుస కుల దురహంకార క్రూర హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి మానవ మగాల్లా మారుతున్న నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్‌ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేసీపీఎస్‌ రాష్ట్రస్థాయి సమావేశం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ జిల్లాలో నిండు గర్భవతిని పసిగుడ్డును క్రూరంగా హత్య చేయడం, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఎల్లంపల్లిలో తన తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడని దళిత యువకుడు ఎర్ర రాజ శేఖర్‌ను కిడ్నాప్‌, హత్య చేసి సజీవ దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని విమర్శించారు. ఇప్పటికైనా కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష పాటిస్తూ రిజర్వేషన్లను ప్రకటించిందని స్కైలాబ్‌ బాబు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించి, బీసీలకు మాత్రం 2024 జనాభా లెక్కల ప్రకారం కేటాయించడం వల్ల ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్‌ సీట్ల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు కూడా 2024 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తద్వారా కొన్ని పంచాయితీలలో దళిత గిరిజనులు సర్పంచులు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 2011 లెక్కల ఆధారంగా ప్రకటించడం వల్ల కొన్ని పంచాయితీలు దళితులు గిరిజనులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ రిజర్వేషన్‌ ప్రక్రియను సవరించాలని కోరారు.ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం రాజ్యాంగ విరుద్ధమనీ, జీవించే హక్కును కాలరాయటమేనని ఆయన విమర్శించారు. ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టి అంబానీ, ఆదానిలకు అడవుల్ని తాకట్టు పెట్టాలనే ఉద్దేశం బీజేపీ చేస్తున్న ఈ హత్యలు వెనుక ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిడ్మా వంటి కీలక నేతలు అనేకమందిని ఇప్పటికే పొట్టన పెట్టుకొని మార్చి 31 నాటికి మావోయిస్టులను చంపేస్తామని కేంద్ర మంత్రి బండి సంజరు మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని చెప్పారు. తక్షణమే చర్చలకు సిద్ధమవుతున్న మావోయిస్టులతో చర్చలు జరిపి సానుకూల వాతావరణం సష్టించాలని డిమాండ్‌ చేశారు.

నవంబర్‌ 28న మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి, డిసెంబర్‌ 6న డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాలు, మెడికల్‌ క్యాంపులు శ్రమదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. పూలే అంబేద్కర్‌ ఆశయాల వెలుగులో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం అనీ, ఆ సందర్భంగా మనువాదాన్ని మట్టు పెడదాం రాజ్యాంగాన్ని ఎత్తి పడదామంటూ రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు, సభలు నిర్వహించాలని ఆ సమావేశం నిర్ణయించింది. సమావేశం ప్రారంభానికి ముందు రైతాంగ ఉద్యమ నాయకుడు సామినేని రామారావును కాంగ్రెస్‌ కార్యకర్తలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. సామినేని రామారావు ,ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ, మావోయిస్టు నేత హిడ్మా, కేవీపీఎస్‌ నాయకులు సంజీవరావు, ఇతర అనేక మంది అమరవీరులకు సంతాపం తెలియజేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, టి.సురేష్‌, బొట్ల శేఖర్‌, జి.రాజు, దుడ్డేల రామ్మూర్తి, ఎం.ప్రకాష్‌ కరత్‌, పి.అశోక్‌, ఉప్పలి మల్కయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం కృపాసాగర్‌, బి సుబ్బారావు, బి.బాలకృష్ణ, మాణిక్యం, రాజు, పాపిట్ల సత్యనారాయణ, కే.అశోక్‌, డుర్కే మోహన్‌, అన్నంపట్ల కృష్ణ, రత్నం ప్రవీణ్‌, జి లక్ష్మీదేవి, గంగామణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -