Thursday, July 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యారంగాన్ని గాలికొదిలిన ప్రభుత్వం

విద్యారంగాన్ని గాలికొదిలిన ప్రభుత్వం

- Advertisement -

– ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రోత్సాహం
– ఫీజు నియంత్రణ చట్టం తెచ్చేదెప్పుడు
– ఖాళీ పోస్టుల భర్తీకి విడుదల కాని నోటిఫికేషన్లు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి
– వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్‌
– సచివాలయ ముట్టడి ఉద్రిక్తం
– విద్యార్థి సంఘాల నేతల అరెస్టు
– అక్రమ అరెస్టులకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. ప్రయివేటు విద్యారంగాన్ని సర్కారు ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ప్రయివేటు విద్యపై ఉన్న ప్రేమ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు చట్టాన్ని ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా సచివాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి సచివాలయంవైపు విద్యార్థి సంఘాల నాయకులు ప్రదర్శనగా వెళ్లారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సచివాలయం వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని దొరికిన వారిని దొరికినట్టుగానే అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా పోలీసులు విద్యార్థులను పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలోకి ఎక్కించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజనీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, సాయిబోల అనిల్‌ (పీడీఎస్‌యూ) పొడపంగి నాగరాజు (పీడీఎస్‌యూ), గడ్డం నాగార్జున, పల్లె మురళి (ఏఐఎఫ్‌డీఎస్‌), హకీం నవీద్‌ (ఏఐఎస్‌బీ), నితీష్‌ (ఏఐడీఎస్‌ఓ), మనే కుమార్‌ (ఏఐపీఎస్‌యూ), మొగిలి వెంకటరెడ్డి (పీడీఎస్‌యూ)తోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వారు మాట్లాడారు. విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైం దని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని పరోక్షంగా అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర విద్యా రంగాన్ని బీజేపీ చేతిలోకి పెట్టే కుట్రలు చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో 2,253 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదనీ, 1,500కు పైగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని విమర్శించారు. 28 వేలకుపైగా పాఠశాలల్లో కంప్యూటర్స్‌ లేవన్నారు. ఇంగ్లీష్‌ మీడియం, ఇతర రాష్ట్రాల మాధ్యమాలైన కన్నడ, ఉర్దూ, మలయాళం చదువుతున్న విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదని విమర్శించారు. రెండు జతలు యూనిఫారాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం ఒక జత మాత్రమే ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని తీసుకొచ్చిందనీ, దాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజనానికి పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని అన్నారు. లైబ్రరీలు, తాగునీరు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, అదనపు గదులకు నిధులను కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శి ంచారు. ఎల్‌కేజీ చదువులకే లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. గురుకులాల్లో సమయపాలనను మార్చాలని కోరారు. గురుకులాలకు సొంత భవనాల ను నిర్మించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌్‌మెంట్‌ను విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ సకాలంలో సమీక్షలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం మమత, డి కిరణ్‌, అశోక్‌రెడ్డి, రమ్య, నాగేందర్‌, స్టాలిన్‌, రజినీకాంత్‌, కైలాస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), చైతన్య, రెహమాన్‌, అనిల్‌ కుమార్‌, హుస్సేన్‌, అరుణ్‌, తేజ, నితీష్‌ (ఏఐఎస్‌ఎఫ్‌), హరీష్‌, నాగరాజు, సాయి, ప్రసాద్‌, బీమ్‌ సేన్‌, సోనీ, నవిత, క్రాంతి, పి మహేష్‌, శ్రీను, శ్యామ్‌, గౌతమ్‌ (పీడీఎస్‌యూ), శ్రీకాంత్‌, ప్రణయ్‌, వరుణ్‌ (ఏఐఎఫ్‌డీఎస్‌), నాగరాజు, శశాంక్‌, సిద్దు (ఏఐడిఎస్‌ఓ), సూర్య కిరణ్‌ (ఏఐఎస్‌బీ), గణేష్‌, సైదులు, వంశీ, రాజు (పీడీఎస్‌యూ) పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -