Friday, July 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వానిది వందేండ్ల ప్రణాళిక

ప్రభుత్వానిది వందేండ్ల ప్రణాళిక

- Advertisement -

పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానం
ప్రపంచ దేశాలతోనే తెలంగాణకు పోటీ
మలబార్‌ బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

వందేండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ పేరుతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదనీ, పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తుల ఎగమతి విషయంలో తమకు దేశంలోని ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదని తెలిపారు. అమెరికా, సింగపూర్‌, కొరియా, యూకే వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతోనే తమ పోటీ ఉంటుందన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌, చెన్నరు సహా దేశంలోని ఏ ఒక్క నగరం కూడా మన హైదరాబాద్‌తో పోటీపడలేదని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండల పరిధిలో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మలబార్‌ బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థను సీఎం గురువారం ప్రారంభించి మాట్లాడారు.

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమనీ, ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారికి, వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తోందని అన్నారు. 20 ఏండ్లలో పాలకులు మారారే కానీ.. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ప్రభుత్వాల విధానాలు మాత్రం మారలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులను కడుపులో పెట్టి చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు గడించొచ్చని, ఫార్మా, ఇతర ఉత్పత్తుల విషయంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ ముందుందన్నారు. బంగారు, వజ్రాభరణాల కొనుగోలు విషయంలో ఇతర రాష్ట్రాల మహిళలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల మహిళలే ముందుంటారని తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల మహిళలు ఉంటారన్నారు.

బంగారు ఆభరణాల తయారీకి మహేశ్వరం అనువైన ప్రదేశమని, ఇక్కడ దేశంలోనే అతిపెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహేశ్వరం, ముచ్చర్ల, బేగరి కంచె కేంద్రంగా 30 వేల ఎకరాల్లో భారత ఫ్యూచర్‌ సిటీని తీర్చిదిద్దబోతున్నట్టు చెప్పారు. అంతకు ముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ తయారీ రంగం గ్రాస్‌ వాల్యూయాడెడ్‌(జీవీఏ) 2022-23లో రూ.1.34 లక్షల కోట్లు ఉండగా, 9 శాతం వృద్ధితో 2023-24లో రూ.1.46 లక్షల కోట్లకు చేరిందన్నారు.

అదే విధంగా తెలంగాణ జీఎస్‌డీపీలో తయారీ రంగం వాటా 19.5 శాతం ఉండగా, అదే జాతీయ స్థాయిలో 17.7 శాతమే ఉందన్నారు. సింగిల్‌ విండో సిస్టం టీజీ ఐపాస్‌ ద్వారా 4200 యూనిట్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. 98 శాతం యూనిట్లకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు జారీ చేశామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, మరింత పారదర్శకంగా, సత్వరమే అనుమతులు జారీ చేసేందుకు టీఎస్‌ఐపాస్‌ను ఏఐతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజరుకుమార్‌, మలబార్‌ గ్రూప్‌ చైర్మెన్‌ ఎంపీ అహ్మద్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -