Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమైనార్టీల ఆర్థిక సాధికారతే సర్కారు లక్ష్యం

మైనార్టీల ఆర్థిక సాధికారతే సర్కారు లక్ష్యం

- Advertisement -

అర్హులైన లబ్దిదారులకు పలు అసెట్స్‌ పంపిణీ
సంక్షేమం కోసం రూ.3,500 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు
రేపటి నుంచి కొత్త పథకాలకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి అజారుద్దీన్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి, వారి ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ తెలిపారు. మైనార్టీల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను బుధవారం నాంపల్లిలోని రెడ్‌ రోజ్‌ ప్యాలెస్‌లో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు అసెట్స్‌ పంపిణీ చేయడంతో పాటు, శిక్షణ-ఉద్యోగ-ప్లేస్‌మెంట్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి రూ.3,500 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

మోపెడ్ల పంపిణీ
ఆర్థిక మద్దతు పథకం కింద ముస్లిం ఫకీర్‌,దుదేకుల, ఇతర బలహీన వర్గాలకు చెందిన 500 మందికి రూ.93,500 విలువైన మోపెడ్లను 100 శాతం సబ్సిడీపై మంత్రి అందజేశారు. ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’ కింద 5వేల మందికి ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే, 33,750 మంది మహిళలకు రూ.7,950 విలువైన కుట్టుమిషన్లను 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. మైనార్టీ యువత కోసం ఒక్కో యూనిట్‌ రూ.1,50,000 విలువ చేసే ఈ-స్కూటర్లను అందించారు. ఇందులో రూ.1,20,000 (80శాతం) ప్రభుత్వ సబ్సిడీ కాగా, 3,150 మంది యువతకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది.

టుర్కా కాశా పథకం
టుర్కా కాశా సామాజిక వర్గానికి చెందిన 2వేల మందికి జనరేటర్లు, టూల్‌కిట్లను 100 శాతం సబ్సిడీపై (యూనిట్‌ విలువ రూ.60,000) అందజేశారు. అలాగే 55 ఎంపానెల్డ్‌ సంస్థల ద్వారా 4,800 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 28వరకు అధికారిక వెబ్‌సైట్‌ హెచ్‌టీటీపీ://టీఎస్‌వోబీఎంఎంఎస్‌.సీజీజీ.గౌ.ఇన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఒబైదుల్లా కోత్వాల్‌ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీయుల్లా మాట్లాడుతూ.. ఫకీర్‌, టుర్కా కాశా వంటి అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎమ్మెల్సీలు మిర్జా రహ్మత్‌ బేగ్‌, రియాజుల్‌ హసన్‌, పట్నం మహేందర్‌ రెడ్డి, వక్ఫ్‌ బోర్డు చైర్మెన్‌ ఫహీమ్‌ ఖురేషీ, హజ్‌ కమిటీ చైర్మెన్‌ అజ్మతుల్లా హుస్సైనీ, టీఎంఆర్‌ఈఐఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ రియాజ్‌, అదనపు కలెక్టర్‌ జితేందర్‌ రెడ్డి, జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారులు ఇలియాస్‌ అహ్మద్‌, ఇతర అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -