– ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
– ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు
– ప్రభుత్వం ఖర్చు చేసిన లెక్కలు వెల్లడిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఎర్రుపాలెంలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఈ ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చి దిద్దటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఇందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో రూ.22 కోట్ల వ్యయంతో 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖకు రూ.11,600 కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం, పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికీ, ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ చేతిలో పెడితే పదేండ్లు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇండ్ల నిర్మాణం కోసం రూ.22,500 కోట్లు కేటాయించామన్నారు.
అటవీ హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరా గిరి జల వికాసం ద్వారా ఉచితంగా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్తు, పామాయిల్, ఆవకాడ మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వారందరికీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, కొత్త చికిత్సలను చేర్చామని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తామన్నారు. ఈ పాఠశాల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు రూ.9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్నీ ప్రారంభించామని, జూన్ 2న లబ్దిదారులను ఎంపిక చేసి లెటర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజిమిల్ ఖాన్, ఆర్డీవో నరసింహారావు, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్‌ఓ కళావతిభాయి, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, తహసీల్దారు ఉషాశారద, ఎంపీడీవో సురేందర్, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, మధిర మార్కెట్ కమిటీ చైర్మెన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES