Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగవర్నర్‌ ప్రసంగం తప్పుల తడక

గవర్నర్‌ ప్రసంగం తప్పుల తడక

- Advertisement -

రెండేండ్లలో కాంగ్రెస్‌ పార్టీ అన్నింటా విఫలం : మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు, అవాస్తవాలు చెప్పించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారి గురించి గవర్నర్‌ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. కేసీఆర్‌ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ తల్లిపై చూపించారని ఆరోపించారు. ఉద్యమంలో తెలంగాణ గుండె చప్పుడును ప్రతిబింబించిన విగ్రహాన్ని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతేడాది ప్రతిపాదిత బడ్జెట్లో 60 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. అప్పుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని అధిగమిస్తోందని ఎద్దేవా చేశారు. 2025-26 ప్రతిపాదిత రుణం రూ.54 వేల కోట్లు కాగా, లక్ష్యాన్ని అధిగమించి రూ.69,143 కోట్లు రుణం చేశారన్నారు. రెండున్నర ఏండ్లలో కేవలం 17 వేల ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. అయితే గత సర్కార్‌ ఇచ్చిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో చిత్త శుద్దితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. కులగణన లెక్కలను బహిర్గతం చేయడంతో పాటు ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మూసీ బఫర్‌ జోన్లో ఉన్న ధనవంతుల ఇండ్లను కూల్చకుండా పేదలపైనే సర్కార్‌ తన ప్రతాపాన్ని చూపిస్తోందని విమర్శించారు. దావోస్‌ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. మహిళలకు రూ.2,500, కాలేజి విద్యార్థులకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం మొదలగు ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండున్నర ఏండ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ఆరోపించారు.
పొన్నం వర్సెస్‌ దాసోజు
శాసన మండలిలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో దాసోజు చేసిన ఆరోపణలపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత సర్కార్‌ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయకపోవడంతోనే తమ ప్రభుత్వం తెలంగాణ గీతంతో పాటు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట బద్దంగా చేయాల్సిందంతా రాష్ట్ర ప్రభుత్వం చేసిందనీ, తుది నిర్ణయం కేంద్రం తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. మంత్రి వ్యాఖ్యలతో దాసోజు ఏకీభవిచంలేదు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న చైర్మెన్‌ ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో దాసోజు తన ప్రసంగాన్ని కొనసా గించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -