మేడారం జాతర మామూలు జాతర కాదు. అదొక విశ్వమహాజాతర. తెలంగాణ మహాకుంభమేళ. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంత గొప్ప ఆదివాశీ జాతర లేదు. ఇది సామ్రాజ్య నిర్మాతల మీద సామాన్యక ోయవీరులు చేసిన తిరుగుబాటుకు నిదర్శనం. మాతృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన స్త్రీ ఆరాధనకు తార్కాణం. విగ్రహారాధన వ్యతిరేకతకు సాక్ష్యం. పట్టమహిషిగా, మహాయోధురాలుగా కాకతీయ సామ్రాజ్యాన్ని 30 సంవత్సరాలు పరిపాలించిన రుద్రమదేవి మన స్మృతిపథం నుంచి తొలిగిపోతున్నది. కానిఒక కోయ తెగకు చెందిన సమ్మక్క మాత్రం పన్నెండవ శతాబ్దం నుండి నేటివరకు 900 సంవత్సరాలుగా జన నీరాజనాలు అందుకుంటూనే వున్నది!
ఇది కట్టుకథ కాదు. చారిత్రక ఆధారాలున్నకథ. చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఆదివాసీల రక్తం జంపన్న వాగై ప్రవహించిన కథ. సమ్మక్క సారలమ్మలు మానవ అవతారాలు చాలించి వనదేవతలైన కథ. అందుకే మేడారం జాతరలో వెల్లడయ్యే భావోద్వేగాలు, దు:ఖవేగాలు, హర్షాతిరేకాలు, భక్తిపారవశ్యాలు ప్రత్యేకమైనవి. మానవ మాత్రులకు అంతుపట్టని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అంశమేదో సమ్మక్క పుట్టుకలోనూ, అంతర్థానంలోనూ ఉన్నదని భక్తుల విశ్వాసం. వివిధ రాష్ట్రాల నుండి విదేశాల నుండి కోట్లాదిగా భక్తజన సందోహాన్ని ఈ జాతర రప్పిస్తున్నది. ఇప్పటిదాక కోటిమంది వనదేవతల గద్దెలను సందర్శించుకున్నారని భావిస్తున్నారు. జనవరి 28 నుండి 31 వరకు కనీసం 10 కోట్ల జనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని ఏ కుంభమేళాతో పోల్చి చూసినా ఇది ఎక్కువే.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు భక్తుల సౌకర్యాల విషయమై సానుకూలమైన అనేక ఏర్పాట్లు చేస్తున్నందువల్ల ఈ ‘నవ మేడారం’ జాతరకు నగర ప్రాంతాల నుండి అంచాలకు మించి భక్త జనులు తరలి వచ్చే అవకాశాలు వున్నాయి.

భారతదేశమంతటా నాగరికతా వికాసానికి దోహదం చేసిన వారిలో ఆదివాసీలు ముఖ్యులు. నదులు విశృంఖలంగా ప్రవహించే అడవులు విస్తృతంగా వ్యాపించే కొండలు, గుహలు ఆవాసాలుగా వుండే ప్రాంతాలలో ప్రకృతి విసిరే హింసాత్మకమైన సవాళ్లను సాహసంతో ఎదుర్కొంటూ, కాలం కత్తి అంచుల మీద యుగాలుగా నడిచి వచ్చారు ఈ ఆదివాసీలు. వారు సృష్టించినది అలిఖిత చరిత్ర. సహజాతి సహజమైన విస్తృత ఘట్టమే కాదు విస్మృత ఘట్టం కూడా. పండితులు, కవులు మైదాన ప్రాంతపు చరిత్రను చిలువలు పలువలుగా వర్ణించి రాసుకున్నారు. ఆదివాసీ తెగలకు చెందినవారు మైదాన ప్రాంతపు చరిత్రకు సమాంతరంగా తమ చరిత్రను ఆశువుగా రచించుకున్నారు. ఇవి కథల రూపంలో, పాటల రూపంలో వుంటాయి. నాట్యం కూడా ఇందులో భాగమే. వీటి ఆదిమ స్వభావంలో సత్సంబంధిత విశ్వాసం గాఢంగా వుంటాయి.
ఇక చారిత్రక నేపధ్యంలోకి వెళ్తే కాకతీయులు, పొలవాస రాజులు సమకాలికులు. పొలవాస రాజ్యం ఒక దశలో కాకతీయ రాజ్యం కన్నా వైభవంగా వుంటూ వచ్చింది. ఈ రెండు రాజ్యాలకు మేడారం ఐతిహాసానికి సన్నిహిత సంబంధాలు వున్నాయి. కాకతీయులు వరంగల్లు కేంద్రంగా రాజ్యపాలన చేశారు. పొలవాసరాజులు ఉమ్మడి కరీనగర్ జిల్లాలోని జగిత్యాల కేంద్రంగా రాజ్య పాలన చేశారు. వీరిద్దరూ స్వతంత్రులేమీ కారు. సామంతరాజులే. కానీ వీరి పాలన దాదాపు వంద సంవత్సరాలే సాగింది. వీరిపాలకులలో మేడరాజు సర్వసమర్థుడు. ఇతని తమ్ముడు గుండరాజు అన్నకు తగ్గ తమ్ముడు.
కాకతీయ ప్రోలరాజు, అతని కుమారుడు రుద్రదేవుడు తమ రాజ్య విస్తరణ కాంక్షకు మేడరాజు, అతని తమ్ముడు అడ్డంకుగా వున్నారని భావించి పెద్ద సైన్యంతో దాడి చేశారు. ఈ యుద్ధంలో గుండరాజు శిరస్సును ఖండించి చంపేశారు. ఇందుకు ‘గుండ: ఖండిత ఏవ ముండిత శిరా:’ అన్న శాసనాధారం వున్నది. ఈ దశలలో మేడరాజు బలహీనుడై కొంతకాలం అడవుల్లో అజ్ఞాతవాసం చేశాడు. ఇప్పటి నుండి కాకతీయుల చరిత్రలో రుద్రదేవుడు (పాలన : 150- 1198, ఇతడు ప్రతాపరుద్రుడు కాదు) తిరుగులేని యోధుడుగా గణనకెక్కి రాజ్యాన్ని సామ్రాజ్యంగా మలుస్తూ వచ్చాడు.
అయితే మేడరాజు ఓడిపోయినా అతనికి ఆదివాసీ ప్రజల మీద వున్న ప్రభావ ప్రాబల్యాలను దృష్టిలో వుంచుకుని రుద్రదేవుడు అతనితో సంధిప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. మేడారాజు తన కుమార్తె సమ్మక్కను తనకిచ్చి వివాహం చేస్తే సఖ్యంగా వుండవచ్చునని ప్రతిపాదించాడట. ఇదెంతవరకు నిజమో తెలియదు. ఆత్మ గౌరవ భావన గాఢంగా వున్న మేడరాజు శత్రువుతో వియ్యమొందడానికి బహుశా ఇష్టపడలేదు. తనమేనల్లుడైన పగడిద్దరాజుకు కూతుర్నిచ్చి సగౌరవంగా వివాహం జరిపించాడు. దీంతో మేడారంలో పగడిద్దరాజు సమ్మక్కల శకం ప్రారంభమైంది.

సమ్మక్కకు సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో వున్నాయి. వీటిలో ప్రధానమైన కథను తెలుసుకుందాం. వేటకు వెళ్లిన కోయదొరలకు నెమలినార చెట్టుదగ్గర ఒక పాపను సంరక్షిస్తూ కొన్ని పెద్దపులులు కనిపించాయట. ఇది చూసిన మేడరాజు సంతానం లేని తమకు దేవతనే దొరికిందన్న ఆనందంతో సమ్మక్క అని పేరు పెట్టుకుని పెంచుకోసాగాడు. సమ్మక్క అనేక మహిమలు ప్రదర్శించసాగింది. ఆమె దైవాంశసంభూతురాలన్న విశ్వాసం ప్రజలకు కలుగసాగింది. పెళ్లి తర్వాత రాజ్యపాలనలో భర్తకు సమ్మక్క సహకారాన్ని అందించసాగింది. కాకతీయులు తమ సామంతుడైన పగడిద్దరాజు మీద కప్పం కట్టవలసిందిగా ఒత్తిడి పెంచారు. కాని కరువుకాటకాల కారణంగా తాము కప్పం కట్టలేమని పగిడిద్దరాజు చెప్పుతూ వచ్చాడు. ఒక దశలో అశాంతికి గురైన పగిడిద్దరాజు మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. దీంతో కాకతీయుల మంత్రి యుగంధరుడు (గంగాధరుడు) పెద్దసైన్యంతో మేడారం మీద దాడి చేశాడు. తాడోపేడో తేల్చుకునే భయంకర యుద్ధంలో పగిడిద్దరాజు, ఆయన అల్లుడు గోవిందరాజు హతమయ్యారు. కొడుకు జంపన్న తీవ్రంగా గాయపడి సంపెంగవాగులో కొట్టుకుపోగా ఆ రక్తంతో ఆ వాగు ఎర్రబారింది. దీంతో కోయలు దాన్ని జంపన్నవాగు అని పిలిచారు. ఈ దుర్వార్తలు వినగానే సమ్మక్క సాయుధురాలై యుద్ధ రంగంలోకి దూకింది. ఆమెకు తోడుగా కూతురు సారలమ్మ కూడా రంగంలోకి దూకి అమరురాలైంది. క్రోధావేశాలతో సమ్మక్క చేస్తున్న ఎదురుదాడి ధాటికి కాకతీయ సైన్యం మట్టి కరుచుకుపోసాగింది. అప్పుడొక దుర్మార్గుడు యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఆమెను వెనుకనుండి బల్లెంతో పొడిచాడు. ఆమె వెంటనే యుద్ధం చాలించి మేడారానికి ఈశాన్యంలో వున్న చిలకలగుట్టపైపు వెళ్లి మాయమైంది. కోయ సైనికులు ఎంత వెదికినా కనిపించలేదు. ఆమె దేవతగా మారిందని, నెమలినారచెట్టు దగ్గరకు కుంకుమ భరిణను తన ప్రతీకగా విడిచి వెళ్లిందని కోయవారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ కుంకుమ భరిణకు జరుగుతున్న పూజలో విగ్రహారాధన కాకపోవడం గుర్తించవలసిన ప్రధాన అంశం పైకి ఇది ఒక చిన్న యుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ దీన్ని ఆదివాసీలు తమ స్వేచ్ఛా స్వతంత్రాల కోసం చేసిన తిరుగుబాటుగా గుర్తించవలసి వుంది.

అయితే ఏ కాకతీయ చక్రవర్తి పాలనాకాలంలో ఈ యుద్ధం జరిగిందనేది విషయంలో ఏకాభిప్రాయం లేదు. చివరి చక్రవర్తి ప్రతాపరుద్రునికాలంలో ఈ యుద్ధం జరిగిందని కొందరు భావిస్తున్నారు. ఇతని పాలనా కాలం 1289 – 1323. మేడారం రాజు కాకతీయులకు కప్పం కట్టకపోవడానికి కరువుకాటకాలే ప్రధానాకారణంగా చెప్తున్నారు. అయితే ప్రతాపరుద్రుని కాలం ఆనటికి చిన్నపాటి సముద్రాలను తలపించే చెరువులు, అదీ గొలుసుకట్టు పద్ధతిలో రైతులకు నీళ్లందించే విధంగా నిర్మితమయ్యాయి. కనుక కరువు ఏర్పడ్డా తట్టుకునే పరిస్థితే వుంది. మరో అంశం ఏకామ్రనాధుడనే కవి రచించిన ‘ప్రతాపరుద్ర చరిత్రము’ అన్న వచన గ్రంథంలో ప్రతాపరుద్రునికి సంబంధించిన అన్ని ముఖ్యాంశాలు పేర్కొనబడ్డాయి. కాని పెద్ద చారిత్రక సంఘటనగా కనిపించే ఈ యుద్ధప్రసక్తి అందులో లేదు. అందువల్ల రుద్రమదేవికే తాతవరుస వాడయిన కాకతీయ రాజ్యాన్ని సామ్రాజ్యంగా నిర్మించడానికి తొలి అడుగులు వేసిన రుద్రదేవుడి కాలంలో బహువా 1170 ప్రాంతంలో ఈ మేడారం యుద్ధం జరిగిందనటానికే ఎక్కువ అవకాశాలున్నాయి. హనుమకొండ, రామప్ప, ఆమనగల్లు, నగునూరు ప్రాంతాలలో దొరికిన శాసనాల్లో ఇందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి.
తమ శౌర్యప్రతాపాలతో ఆదివాసీ అస్తిత్వాన్ని నిలిపిన కోయదొరలు, గోండు, ఎరుక, బోయ, చెంచు వంటి ఇతర ఆదివాసీ తెగల వారితో కూడా ధైర్యసాహసాలు రగిలించారనటంలో అతిశయోక్తి లేదు. తమ సంస్కృతీ సంప్రదాయాలను, విశిష్టమైన ఆరాధనా పద్ధతులను, ప్రత్యేకమైన సాహిత్యం, లలిత కళలను పరిరక్షించుకుంటూ ముదుకు సాగుతున్న ఆదివాసీలు అభినందనీయులు. నిజాయితీపరులు, విశ్వాసపాత్రులు అయిన వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయవసిందిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది.
(మేడారం జాతర 28-1-2026 నుండి 31-1-2026 వరకు)
అమ్మంగి వేణుగోపాల్, 9441054637



