గాజా ఒక మహోద్రిక్త ఘట్టంలో వుంది. చరిత్రతో ముప్పుతిప్పలు పడుతున్నా గొప్ప మార్పును సాధించేందుకు కావలసిన చైతన్యం నింపుకున్న పాలస్తీనా ప్రజలను తేరిపార చూసే సమయమిది. అంతంటూ లేని జాతి విద్వేష మారణహోమం, వినాశనకాండ సాగించే ఒక కృత్రిమ వలస రాజ్యాన్ని విధ్వంసం చేసే సత్తా వారికి వుందని తెలియజెప్పే తరుణం. వెనిస్ చిత్రోత్సవంలో ‘వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్’ చిత్రానికి 23 నిముషాల పాటు సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసిన సందర్భం కన్నా ఇందుకు మరో గొప్ప నిదర్శనం వుండదు. ఇది మున్నెన్నడూ ఎరగని ఒక అపూరూప తరుణం.
ట్యునీషియా దర్శకురాలు కౌతర్ బెన్ హనియా చేసిన ఈ పున:సృజన హింద్ రజాబ్ అనే ఆరేళ్ల పాప కథను కండ్ల ముందుంచుతుంది. 2024 జనవరిలో గాజా నగరంలో ఇజ్రాయిల్ సైనికమూకలు కారు పేల్చివేసిన దారుణ ఘటనలో తను ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరులు, బాబాయి, పిన్నితో పాటు కాపాడేందుకు వచ్చిన ఇద్దరు వైద్యసిబ్బంది కూడా బలయ్యారు. రెడ్ క్రెసెంట్ సొసైటీ రికార్డుల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపకం తయా రైంది. కుటుంబ సభ్యుల మృతదేహాల పక్కనే గాయాలతో పడివున్న రజాబ్ హింద్‌ను కాపాడేందుకు ఆ సొసైటీ గంటల తరబడి ప్రయత్నించింది. 2024 జనవరి 29 నాటి రికార్డింగులో ఆమె రోదన, ఆర్తనాదాలు విని పిస్తున్నాయి. ఒకవైపున తుపాకులు మోగిపోతుంటే ఆ పాప ”దయచేసి ఎవరైనా నా దగ్గరకు వచ్చి కాపాడండి. దయచేసి రండి. నాకు చాలా భయమేస్తుంది…” అని ఆర్తనాదాలు చేయడం కలచివేస్తుంది. సహాయపడటం కోసం ఒక అంబులెన్సు వస్తుంటే ఆపకుండా కాల్పులు సాగిస్తున్న ఇజ్రాయిల్ ట్యాంకులు దాన్నీ చాలా దగ్గరనుంచే ధ్వంసం చేస్తాయి. హింద్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును 300 తూటాలు తూట్లు ఛిద్రం చేశాయి. అంబులెన్సును బాగుచేయడానికి రెండు గంటలు కష్టపడాల్సి వచ్చింది.
వారందరి స్వరమిది
ఈ చిత్రంలో నటించిన సాజా కిలానీ పాత్రికేయులతో మాట్లాడారు. ”సామూహిక హత్యాకాండ, ఆకలి మంటలు, అమానవీయత, విధ్వంసం, దురాక్రమణ ఇక చాలు.” అంటూ ఇంకా ఇలా చెప్పారు…”ఈ చిత్రం ఒక అభిప్రాయమో లేక ఊహాకల్పనో కాదు. ఇది సత్యాన్ని కండ్లకు కట్టే సాధనం. హింద్ కథ మొత్తం ఒక జనావళి బాధను చెబుతుంది. గత రెండేళ్లలోనే గాజాలో చంపబడిన వేలాది మంది పిల్లల గొంతు వినిపించే ఒక కథ. జీవించే హక్కు, కలలు కనే హక్కు, గౌరవంతో మనుగడ సాగించే హక్కు కలిగివున్న ప్రతి చిన్నారి, బాలికా, బాలకుల గొంతుక అది. అయితే ఇవన్నీ మనం కండ్లప్పగించి చూస్తుండగానే కాలరాచి వేయబడుతున్నాయి”.
ఈ చిత్ర నిర్మాణంలో హాలీవుడ్ ప్రముఖులు భాగస్వాములు కావడం గమనించదగింది. ప్రజాభిప్రాయంలో గొప్ప మార్పు ఉప్పొంగి వస్తున్నదని దీనిపై సమీక్షలు చెబుతు న్నాయి. ”నిర్లక్ష్యం, నిర్దయాత్మకం… ప్రజ్వలింపచేసే ప్రతిభ… నిస్సందేహంగా వెనిస్‌ను రగిలించిన చిత్రం ఏదంటే ఇదే..” అని గార్డియన్ పత్రిక పేర్కొంది. ”ఒక మాన వీయ అద్భుతం. చిత్రోత్సవంలో అత్యున్నత గౌరవానికి అర్హమిదే” అని ‘వోగ్’ వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి రజత సింహం అవార్డు రావడం ఈ మొత్తం గాధలో చిన్న భాగమే.
ఇలా జరగాలని ఎంతగానో ఎదురు చూస్తున్న సందర్భమే ఇది. గాజా విషయంలో వాతావరణ మార్పుకు మరో సంకేతం ‘సముద్ ఫ్లొటిల్లా’. దిగ్బంధం ఎత్తివేయించే అతి పెద్ద ప్రయత్నం. గాజా సముద్ర మార్గ దిగ్బంధాన్ని సవాలు చేసిన నాలుగో పెద్ద ప్రయత్నం. 44 దేశాలకు చెందిన కార్యకర్తలతో 55 పడవలు ఆహారం, నీళ్లు, మందులు, తీసుకుని బయలుదేరాయి. బార్సిలోనా, ట్యునిస్, సిరియాల నుంచి బయలుదేరిన ఈ నావలు సెప్టెంబరు మధ్యకల్లా గమ్యం చేరవచ్చు. అంతకంతకూ పెరుగుతున్న సౌహార్ద్రత ఈ రూపంలో వ్యక్తమవుతున్నది. ఫ్లొటిల్లాను గనక అడ్డుకుంటే తాము సముద్ర రవాణా కార్యకలాపాలనే ఆపేస్తామని రేవు కార్మిక సంఘాలు హెచ్చరిక జారీ చేయడం చాలా ప్రముఖమైన పరిణామం.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ సంఘీభావ స్ఫూర్తికి ప్రతీకగా మాట్లాడాడు.: ‘పాలస్తీనా చచ్చిపోతే దాంతో పాటే మానవాళి చచ్చిపోయినట్టే, మీరు మొదలు పెట్టింది కేవలం సముద్ర యానమే కాదు. ఇదో నైతిక యుద్ధారావం. సముద్రపు గాలులు మీ పడవలను చరిత్ర పవనాలతో పాటు తీసుకెళ్లుగాక. సాగరం రెండు చేతులు చాచి మిమ్మల్ను ఆహ్వానించుగాక. ప్రపంచం మీ సం దేశాన్ని ఆలకించుగాక. మీరు గాజా జలాలను చేరే సమయానికి మీతో పాటు కోట్లాది గొంతులు కలసి వినిపిస్తాయి. శాంతి అనేది కేవలం ఊహ కాదని, బాధ్యతగా సాధించ వలసిందనీ గుర్తు చేస్తాయి”.
ఎంత వినాశం తర్వాత…?
ఇంతటి తపన, సంఘీభావం హఠాత్తుగా పుట్టుకు రాలేదు. ఇప్పటికి అక్కడ 63వేలమంది బలయ్యారు. 332 మంది ఆహారం లేక అసువులు బాశారు. వారిలో 124 మంది కసిగందులు. 240 మందికి పైగా జర్నలిస్టులు చంపి వేయబడ్డారు. జన నష్టం చాలా విపరీతంగా వుందని ప్రకటించడానికి తమరికి మరెంత మంది బలికావాలి? ఇలాంటిది ఎప్పుడూ జరగొద్దని చెప్పడం ఎప్పటికి మొదలెడతారు? యూదు జాత్యహంకార రాజ్యం యుద్ధ మారణకాండ ప్రారంభించి రెండేళ్లయింది. భూగోళం చిత్రపటం నుంచి పాలస్తీనాను లేకుండా చేయాలనేదే దాని పన్నాగం. నాటి నుంచి కూడా ఆ మారణహోమం ఇండ్లలో ప్రసార మవుతుంటే చూసి ప్రపంచ వ్యాపితంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. మానవతా సాయం కూడా అందకుండా అడ్డుకుంటున్న ఇజ్రాయిల్ విధానం ఆస్పత్రులపై బాంబుల వర్షం, తిండి కోసం క్యూలో నిలబడ్డ పౌరులను కూడా కాల్చి చంపడం వంటివి వారిని మరింత కల్లోల పరుస్తోంది.
ఈ పరిణామాలకు తోడు వలసదార్లతో కూడిన వలసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఉద్యమం విస్తరించడం, ఒకప్పుడు ఇజ్రాయిల్‌తో నిలబడిన దేశాల పాలకుల స్పందనలో కూడా మార్పు తెస్తున్నది. కనుచూపు మేరలో ఎలాంటి జవాబుదారీ తనం లేని నెతన్యాహూ ప్రభుత్వం అంతకంతకూ దౌత్యపరంగా ఏకాకి అయిపోతున్నది. దానికంటూ విశ్వసనీయత ఏమన్నా మిగిలి వుంటే అదీ పోగొట్టుకుంటున్నది. యూరప్‌లోనే గాక అమెరికాలో కూడా పాలస్తీనా గాజా అన్నవి ప్రధాన సమస్యలుగా ముందుకొచ్చి నిలబడుతున్నాయి.
కీలకమైన సెప్టెంబరు
అందుకే సెప్టెంబరు నెల చాలా కీలకమైన మలుపుగా మారింది.ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఒక శాశ్వత సభ్య దేశం వీటోతో భద్రతా మండలికి అడ్డుకట్ట వేస్తే ఐక్యరాజ్యసమితి సాధారణ సమితి (యుఎన్‌జిఎ) చర్య తీసుకోవచ్చు. శాంతి యంత్రాంగం నిబంధన ప్రకారం యుఎన్‌జిఎ పాలస్తీనాకు ఒక శాంతి బలగాన్ని తరలిం చవచ్చు. ఆ విధంగా పౌరుల రక్షణ కోసం మానవతా సహాయం చేయొచ్చు. యుద్ధ నేరాల సాక్ష్యాలను భద్రపరచి ప్రజలు కోలుకోవడానికి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టవచ్చు ఐక్యరాజ్యసమితి సాధారణ సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) గత ఏడాది ఇజ్రాయిల్‌కు జారీ చేసిన ఉత్తర్వులు, నిర్ధారణలు, వాటిని అమలు చేయకపోతే తీసుకుంటానన్న చర్యల గడువు ముగియబోతుంది. ఈ విషయంలో చేయాల్సిన దానికి ఇది చాలా కీలక సమయం అవుతుంది. నిజానికి ఎప్పుడో జోక్యం చేసుకోవలసిన విషయం.ఇందుకు సంబంధించి తాను పాలస్తీనాను గుర్తిస్తానని ఐరాస సర్వ సభ్య సమావేశంలో బెల్జియం ప్రకటిం చింది. ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా కూడా అదే చెప్పాయి. పశ్చిమ తీరంలోని అక్రమ వలసలలో తయారై వచ్చే అన్ని సరుకుల నిషేధంతో సహా పన్నెండు ఆంక్షలు విధిస్తానని కూడా బెల్జియం ఆలోచిస్తున్నది. ఇజ్రాయిల్ కంపెనీలతో ముడిపడిన సరుకుల సేకరణపై సమీక్ష జరుపుతానని అంటోంది. మారణహోమాలు, మానవ జాతిపై నేరాలు, ఇజ్రాయిల్ యుద్ధ నేరాలను అడ్డుకునేందుకు జెనీవా సదస్సు తీర్మానం పాటించాల్సి వుంటుంది. ఇతర అంతర్జాతీయ చట్టాల ప్రకారం దేశాలు వ్యవహరించడం కూడా జరగాలి. పాలస్తీనా ప్రభుత్వం అలాంటి జోక్యం కోసం విజ్ఞప్తి చేసింది. పాలస్తీనా పౌర సమాజం పదేపదే కోరింది. 1968 నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలు ఆక్రమించడం, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయడం అక్రమమని ఐసిజె ఎప్పుడో ప్రకటించింది. గాజాలో మారణహోమాలు జరిగే ముప్పు చాలావుందని హెచ్చరించింది. ఈ రూలింగ్‌లన్నీ కలిపి చూస్తే అక్కడ అంతర్జాతీయ జోక్యం న్యాయమే కాదు అత్యవసరమని కూడా తెలుస్తుంది.
మోడీ సర్కారు నిర్వాకం
ఈ ఏడాది ఐరాస సమావేశాలకున్న అసాధారణ ప్రాధాన్యత రీత్యా చూస్తే ట్రంప్ ప్రభుత్వం పాలస్తీనా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడానికి అనుమతి నిరాకరించడం దారుణం. నిస్పృహతో కూడిందిగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన బ్రిక్స్, ఎస్.సి.వో శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యం అంతకంతకూ ప్రాభవం కోల్పోతున్నది. ఈ సమయంలో ఇలాంటి ఎత్తుగడలు ఇజ్రాయిల్, అమెరికాల విశ్వసనీయతను మరింతగా దెబ్బతీస్తాయి. ప్రజాస్వామ్య యోధులమంటూ తమకు తామే తగిలించుకున్న పాత్ర ప్రపంచానికే పరిహాసప్రాయంగా మారిపోతుంది.
ఈలోగా పచ్చి మితవాద ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ఇండియా వచ్చారు. ఆయన చేసిన దారుణ వ్యాఖ్యల కారణంగా అనేక పాశ్చాత్య దేశాలు, ఇ.యు కూడా ఆంక్షలు విధించి తీవ్ర ఖండనలు చేశాయి. ఆయన ఒక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇండియా వచ్చారు. పశ్చిమ తీరంలో వివాదాస్పద ఇ1 ఆవాసాలను స్మోట్రిచ్ ఇటీవలే పూనరుద్ధరించారు. దీనివల్ల పాలస్తీనా దేశం ఏర్పాటు అవకాశం శాశ్వతంగా లేకుండా పోతుందని విమర్శకులు చేస్తున్న హెచ్చరిక. పశ్చిమ తీరంలో 82 శాతం ఆక్రమణతో ఆయన ఇటీవలే ఒక పటం విడుదల చేశాడు. దాంట్లో పాలస్తీనియన్లకు ఏవో కొన్ని కేంద్రాలు మాత్రమే వుంటాయి. బందీల విడుదల కోసం గాజా జనాల కడుపు మాడిస్తే తప్పేంటని సమర్థించేందుకు ఆయన తెగబడ్డాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇ.యు ఖండించాయి. పాలస్తీనియన్లపై తియాంజిన్ తీర్మానానికి ఆమోదం చెప్పిన ఇండియా ఈ విధంగా స్మోట్రిక్‌కు స్వాగతం పలకడం ప్రపంచ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వుంది. ఇజ్రాయిల్‌తో సైనిక భద్రతా సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని భారత ప్రజలు ముక్తకంఠంతో చాటిచెప్పాలి. మారణహోమానికి బలవుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెల్పడానికి ద్విగుణీకృత శక్తితో ముందుకు రావాలి. మరెప్పుడూ ఇలా జరగవద్దంటే వద్దని ఢంకా మోగించాలి.
(సెప్టెంబర్ 9 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
గాజాపై మానవాళి మహా స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES