Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంముంబయి వైపుగా మహాపాదయాత్ర

ముంబయి వైపుగా మహాపాదయాత్ర

- Advertisement -

ఉవ్వెత్తున సాగుతున్న లాంగ్‌మార్చ్‌
రిపబ్లిక్‌ డే వేడుకను ఉత్సాహంగా నిర్వహించుకున్న నిరసనకారులు

నాసిక్‌ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరుగుతున్న లాంగ్‌మార్చ్‌ ముంబయి వైపుగా ఉవ్వెత్తున సాగుతోంది. నాసిక్‌లో ఆదివారం ప్రారంభమైన పాదయాత్రలో పదివేలకు పైగా పాల్గొంటున్నారు. ఎర్రజెండాలు చేతబూని, వామపక్ష నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే సోమవారం గణతంత్ర దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం ఉత్సాహభరితమైన వాతావరణంలో నాసిక్‌-ముంబయి జాతీయ రహదారిపైనే ఈ కార్యక్రమం జరిగింది. లాంగ్‌మార్చ్‌లో ముందున్న ట్రక్కుపైన ఎత్తుగా జాతీయ జెండాను కట్టారు. త్రివర్ణ పతాకానికి పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. సీపీఐ(ఎం), ఏఐకేఎస్‌ నాయకులు డాక్టర్‌ అశోక్‌ ధావలే, మాజీ ఎమ్మెల్యే జెపి గావిట్‌, డాక్టర్‌ అజిత్‌ నవాలే, ఉమేష్‌ దేశ్‌ముఖ్‌, సునీల్‌ మలుసారే, సావ్లిరామ్‌ పవార్‌, భీకా రాథోడ్‌, ఉత్తమ్‌ కడు వంటి నాయకులు జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన వారిలో ఉన్నారు.

అలాగే పదివేలకు పైగా ఉన్న ఆందోళనకారులు కూడా జాతీయ జెండాకు వందనం చేశారు. భారీ సంఖ్యలో ఉన్న ఆందోళనకారులంతా అటెన్షన్‌గా నిలబడి సామూహిక వందనం చేస్తుండగా జాతీయ గీతం ఆలపించారు. దేశంలోని అత్యంత పేద, దోపిడీకి గురవుతున్న ఆదివాసీలు, రైతులతో సాగుతున్న ఈ లాంగ్‌మార్చ్‌ మధ్యలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా హృదయానికి హత్తుకునే సందర్భంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు రాజ్యాంగ రూపకల్పనలో భారతరత్న అంబేద్కర్‌ చేసిన కృషిని సర్మించుకున్నారు. అలాగే, దేశస్వాతంత్య్ర పోరాటంలోనూ, శ్రామిక పోరాటంలోనూ అమరులైన వారికి నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, ప్రజస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం వంటి ప్రాథమిక రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. ఈ రిపబ్లిక్‌ డే కార్యక్రమం తరువాత లాంగ్‌మార్చ్‌ ముంబయి వైపుగా కదలింది.

సంప్రదింపులు ప్రారంభించిన మహారాష్ట్ర ప్రభుత్వం
మరోవైపు ఈ పాదయాత్ర నాయకులతో మహారాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడం ప్రారంభించింది. అయితే ఈ సంప్రదింపులను నాయకులు తిరస్కరించారు. ముఖ్యమంత్రి స్వయంగా సీపీఐ(ఎం)-ఏఐకేఎస్‌ ప్రతినిధి బృందంతో సమావేశమై, పాదయాత్ర డిమాండ్లను అంగీకరించే వరకూ పాదయాత్ర జరుగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో నాసిక్‌లో సీపీఐ( ఎం) ఆదివారం మహా పాదయాత్రను ప్రారంభించింది. నాసిక్‌ జిల్లాల్లోని అన్ని తాలుకాలకు చెందిన మహిళలు, పురుషులు, వృద్ధులు, యువకులు ఈ లాంగ్‌మార్చ్‌లో భాగస్వామ్యమయ్యారు.

ఈ నెల 21న పాల్ఘడ్‌లో 50 వేల మందితో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన మార్చ్‌ విజయవంతమైన నేపథ్యంలో నాసిక్‌ నుంచి రెండో మార్చ్‌ నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలిపారు. పాల్ఘడ్‌ పోరాటం వలెనే, నాసిక్‌ పోరాటం కూడా రెండు ప్రధాన సమస్యలపై జరుగుతోందన్నారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ),పెసా చట్టం, సాగునీటి పథకాలు, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో వేలాది ఖాళీల భర్తీ మొదలైన వాటిపై గతంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకపోవడంపై పోరాటం జరుగుతున్నారు. అలాగే, స్మార్ట్‌ మీటర్‌ పథకం, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పునరుద్ధరణ, గ్రామీణ ఉపాధిని బలహీనపరచడం, ప్రభుత్వ-కార్పొరేట్‌ కూటమి భూముల ఆక్రమణ, నాలుగు కార్మిక కోడ్‌ల విధించడం మొదలైన సమస్యలపై పోరాటం సాగుతోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -