అట్టహాసంగా ప్రారంభం..దేశ, విదేశీ ప్రముఖుల రాక
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
చర్చలు, ఒప్పందాలతో హడావిడి
అన్నీ తానై కలియతిరిగిన సీఎం రేవంత్‌రెడ్డి
భారీ భద్రత-నోరూరించే వంటకాలు
టూరిజం స్టాల్‌కు జూపల్లి రిబ్బన్ కటింగ్
నాలుగు వేదికలమీదా చర్చాగోష్టులు
భాగస్వాములైన మంత్రులు, ఉన్నతాధికారులు
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 తొలిరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవిదేశీ ప్రతినిధులు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హోటళ్లన్నీ నిండిపోయాయి. నగరం నుంచి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్లన్నీ బిజీగా కనిపించాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో ఫ్యూచర్ సిటీ రోడ్డు కిటకిటలాడింది. దాదాపు రూ.9 లక్షలకోట్ల భారీపెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టిన గ్లోబల్ సమ్మిట్ చరిత్రను సృష్టించనుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాంగణం తాత్కాలికంగా నిర్మించిన భారీ హాళ్లు, టెంట్లు, ప్రత్యేక నివాసాలతో కళకళాలాడింది. గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు స్వాగతం పలుకుతోంది. వచ్చే పదేండ్లల్లో ఈ ప్రభుత్వం కళ నెలరవేరుతుందని ఆశిద్దాం’ అని సీఐఐ మాజీ చైర్మెన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నో అద్భుతాలు చేస్తున్నదనీ, భవిష్యత్‌లో మరిన్ని సాధిస్తుందని నోబెల్ బహుమతి గ్రహిత కైలాష్ సత్యార్థి ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు సోమవారం సాధారణ వాహనాలతోపాటు ఫ్యూచర్ సిటీకి వచ్చే కార్లతో నిండుగా కనిపించింది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, మధ్యలో డివైడర్లు, అందులో కొబ్బరి చెట్లతో కోనసీమను తలపించింది. మధ్యాహ్నాం ఒంటి గంటకు సీఎం రేవంత్‌రెడ్డి రాకతో గ్లోబల్ సమ్మిట్‌లో ఉత్సాహం రెట్టింపైంది. ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలోని అన్ని హాళ్లల్లో సమ్మిట్‌కు సాధారణ పౌరులు, దేశ, విదేశీ ప్రతినిధులతో కిక్కిరిసిపోయాయి. ఫ్యూచర్ సిటీకీ భారీ భద్రత కల్పించారు. వచ్చిన ప్రతినిధులకు హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లల్లో బస ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్కారు అన్ని వసతులను ప్రతినిధులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన హాలులో వేదిక పక్కనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
పర్యాటక శాఖ స్టాల్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి
తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేకస్టాల్‌ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్శించేలా తెలంగాణ పర్యాటక అందాలు, చారిత్రక ప్రదేశాల ఛాయచిత్రాలను డిజిటల్ స్క్రీన్‌లో ప్రదర్శించారు. టచ్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పర్యాటక అభివద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు.
ఒలెక్ట్రా కారు ఆవిష్కరణ
ఫ్యూచర్ సిటి ప్రాంగణంలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారును ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సీఎం స్వయంగా కారు నడిపారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బస్సును సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు పరిశీలించారు.
నోరూరించే వంటకాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన అతిథులకు రాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా నోరూరించే వంటకాలను తయారు చేశారు. దానితోపాటే దేశ విదేశాలకు సంబంధించిన వంటకాలను వేడివేడిగా వడ్డిస్తున్నారు. తాజ్ హోటళ్ల ఎగ్జికూటివ్ షెఫ్ గణేష్ బృందం ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. శుభ్రతను కచ్చితంగా పాటిస్తున్నట్టు ఆయన చెప్పారు. దాదాపు 450 మంది అతిథుల కోసం వంటకాలు తయారు చేస్తున్నామన్నారు. చికెన్, మటన్, బిర్యానీ, రోటీ, సలాడ్స్, స్వీట్లు, పండ్ల రసాలూ ఉన్నాయి. రకరకాల డ్రింక్స్ కూడా పెట్టారు. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ కూడా అతిథులకు అందిస్తున్నారు. అతిథుల అభిరుచికి అనుగుణంగా ఐదు రకాల చారును అందిస్తున్నారు.
సీఎంకు హారు చెప్పిన రోబో
అనేక వింతలు, విశేషాలతో గ్లోబల్ సిటీ ప్రాంగణం నిండిపోయింది. మధ్యాహ్నాం ఒంటిగంటకు ప్రాంగణంలోకి వచ్చిన ఓ రోబో సందడి చేసింది. సీఎం రేవంత్‌కు ఆ రోబో హారు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం వెంటే ఉన్న సీనీ నటుడు అక్కినేని నాగార్జున రోబోకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, తిరస్కరించింది.
భారీ భద్రత
జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, పలుదేశాలు ప్రతినిధులు ఫ్యూచర్ సీటికీవద్దకు చేరుకుంటున్నారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు బసచేసే హోటళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతినిధులకు లైజనింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీవీఐపీ పారిశ్రామికవేత్తలకు డిఎస్పీ ర్యాంకు అధికారితోభద్రత కల్పించారు. వీవీఐపీ పారిశ్రామిక వేత్తలు, ఐఏఎస్‌లకు యాక్సెస్ పాసులు ఇచ్చారు. సీఎం, ప్రముఖులు మాట్లాడే ప్రధాన హాలులో రెండు వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులతో శాఖల వారీగా సమావేశాల తర్వాత ఒప్పందాలు జరుగుతున్నాయి.
అందరూ ఐదు నిమిషాలు..సీఎం 10 నిమిషాలు
ప్రధాన హాలులో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం అందరూ అనుకున్నట్టుగా విజయవంతంగా జరిగింది. అధికారులు రూపొందించిన షెడ్యూల్‌లో ఎక్కడా తేడా రానీయకుండా సదస్సును ముందుకు నడిపించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్‌రంజన్ సమావేశాన్ని నడిపించారు. అందరితో మాట్లాడించారు. గవర్నరల్ జిష్ణుదేవ్ వర్మ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్’ అంటూ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ సదస్సు నుంచి లోక్‌భవన్‌కు వెళ్లిపోయారు. వేదిక మీద ఉన్న మిగతా అతిథులంతా ఐదు నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి ఐదు నిమిషాలు మాట్లాడగా, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పది నిమిషాలు మాట్లాడారు. ఇద్దరు విదేశీ ప్రతినిధులు మాత్రం లైవ్‌లో వీడియో సందేశం ఇచ్చారు.
గ్రేటెస్ట్ గ్లోబల్ సమ్మిట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



