నివారణకు సమగ్ర చర్యలు అవసరం : నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప
నవతెలంగాణ-సిటీబ్యూరో
వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధి భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సమగ్ర నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అన్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందస్తు గుర్తింపు, ప్రజల్లో అవగాహన, అందరికీ అందుబాటులో ఉండే చికిత్సా సౌకర్యాలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కాన్సర్ రిజిస్ట్రీ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సదాశివుడు గుండేటి మాట్లాడుతూ.. క్యాన్సర్ నివారణలో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ కార్యక్రమాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో భారత వైద్య పరిశోధనా మండలికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ ఎపిడెమియాలజీ విడుదల చేసిన ”తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్-2026”పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ ప్రొఫైల్ ఆధారంగా రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాప్తి, ప్రభావం, నియంత్రణ చర్యలపై విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యతను వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల నమోదు, డేటా విశ్లేషణ, సమగ్ర నివారణ చర్యలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. పీబీసీఆర్ (పాపులేషన్ బేస్డ్ కాన్సర్ రిజిస్ట్రీ) సోర్స్ ఆస్పత్రుల నుంచి డేటా అందించినందుకు సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ శాంతవీర్ ఉప్పీన్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ రఘునాథరావు, అడిషనల్ ప్రొఫెసర్ అండ్ హెడ్-మెడికల్ ఆంకాలజీ డా.మెహెర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డా.రచన చెన్నమనేని, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా.మోనికా, పాథాలజిస్ట్ డా.తారా రోషిణి పాల్, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డా.ఉప్పలపాటి శ్రీహరి, వివిధ ఆస్పత్రుల వైద్యులు, పీజీ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.


