116వ స్థానంలో భారత్
యువతను దెబ్బతీస్తున్న సోషల్ మీడియా
ఆందోళన వ్యక్తం చేసిన హ్యాపీ ఇండెక్స్ నివేదిక
న్యూఢిల్లీ : రోజు రోజుకు తీవ్రమవుతున్న సోషల్ మీడియా వినియోగం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యువతకు ముప్పుగా పరిణమిస్తోంది. వారి సంక్షేమాన్ని, భవితవ్యాన్ని దెబ్బతీస్తోందని గురువారం విడుదల చేసిన ప్రపంచ సంతోష సూచిక (హ్యాపీ ఇండెక్స్)-2026 పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలబడిందని నివేదిక పేర్కొంది. వరుసగా 9వ ఏడాది ఈ ఘనతను సొంతం చేసుకున్న దేశంగా ఫిన్లాండ్ రికార్డు నమోదు చేసింది. మొత్తంగా 147 దేశాలతో నివేదికను విడుదల చేయగా, అందులో భారత్ 116వ స్థానంలో వుంది. గతేడాది 118వ స్థానంతో సరిపెట్టుకుంది.
అమెరికా 23వ స్థానంలో వుండగా, కెనడా 25, బ్రిటన్ 29 స్థానాలను కైవసం చేసుకున్నాయి. పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై ఆంక్షలు విధించాలని ఇందుకోసం చట్టాలు, నిబంధనలను రూపొందించాలని అనేక దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కనబరుస్తున్న ప్రభావాలను ఈ ఏడాది వరల్డ్ హ్యాపినెస్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. అలాగే సంతోషానికి, ఆనందానికి సూచికలుగా ఆరు అంశాలను – తలసరి జీడీపీ, ఆయుర్దాయం, సామాజిక మద్దతు, జీవన ఎంపికల్లో స్వేచ్ఛ, ఉదారత, అవినీతి పట్ల వైఖరి – పేర్కొంది.
ఈ ఏడాది కూడా నార్డిక్ దేశాలే హ్యాపినెస్ ర్యాంకింగ్స్‌లో ముందున్నాయి. వరుసగా మొదటి పది దేశాల్లో ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయిల్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ దేశాలు వున్నాయి. లాటిన్ అమెరికా దేశం ఈసారి నాల్గవ ర్యాంక్ సాధించడం విశేషం. ఇక ఆఫ్ఘనిస్తాన్ నివేదికలో అట్టడుగున గల దేశంగా నమోదైంది. ఏమాత్రమూ సంతోషంగా లేని పది దేశాల్లో టాంజానియా, ఈజిప్ట్, డి.ఆర్.కాంగో, లెబనాన్, ఎమెన్, బోత్సవానా, జింబాబ్వే, ఆ తర్వాత స్థానాల్లో సియర్రా లియోన్, ఆఫ్రికాలోని మలవి దేశాలు వున్నాయి. గత దశాబ్ద కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,న్యూజీలాండ్ వంటి దేశాల్లో 25ఏళ్ళ లోపు యువత జీవన విధానం ఎలా తయారైందో ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. లెక్కా పక్కా లేకుండా పలు గంటల పాటు సోషల్ మీడియాలో వుండిపోవడమనేది ఈ నయా ధోరణిలోని కీలకాంశమని పేర్కొంది.
కానీ అదే సమయంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో యువత వారి జీవితాలను మెరుగు పరుచుకుంటున్నారని నివేదిక ఎత్తి చూపింది. అలాగే శ్రేయస్సుకు, సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించడానికి మధ్య గల ప్రతికూల బంధం కౌమార దశలోని బాలికల విషయంలో ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, ఐదు గంటలు అంతకంటే ఎక్కువసేపు సోషల్ మీడియాను ఉపయోగించే 15ఏండ్లు బాలికలు అంతకంటే తక్కువసేపు సామాజిక మాధ్యమాల్లో వుండేవారితో పోలిస్తే జీవితం పట్ల సంతృప్తికరంగా లేరని తెలుస్తోందని నివేదిక పేర్కొంది. ఫిన్లాండ్ వరసగా 9ఏండ్లుగా అత్యంత సంతోషకరమైన దేశంగా నమోదవడానికి గల కారణాలను వివరిస్తూ సంపదు వుండడం, అది సమానంగా పంపిణీ కావడం, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ముప్పుల నుంచి ప్రజలను కాపాడే సంక్షేమ దేశంగా వుండడం, ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రధానమని నివేదిక పేర్కొంది.



