Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆశా కార్యకర్తలపై వేధింపులు ఆపాలి

ఆశా కార్యకర్తలపై వేధింపులు ఆపాలి

- Advertisement -

ఆన్‌లైన్‌ వర్క్‌ ఇవ్వొద్దు…తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి. జయలక్ష్మి
కోఠి డీఎంహెచ్‌ఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా


నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
ఆశా వర్కర్లపై ఆన్‌లైన్‌ వర్క్‌ పేరుతో జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఆశా వర్కర్లు సోమవారం హైదరాబాద్‌ కోఠి డీఎంహెచ్‌ఎస్‌ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశాలపై టార్గెట్ల పేరుతో అధికారులు ఒత్తిడులు తెస్తున్నారని, ఇది పూర్తిగా అన్యాయమని అన్నారు. పెండింగ్‌లో ఉన్న వివిధ సర్వేల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో మరెక్కడా లేని విధంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మాత్రమే ఆశాల చేత ఆన్‌లైన్‌ వర్క్‌ చేయిస్తున్నారని తెలిపారు. ఎన్సీడీ, పీఎన్‌సీ, ఏఎన్‌సీ, టీబీ, పీఎన్‌సీ వంటి కార్యక్రమాలను ఆశాలపై బలవంతంగా మోపడం సరైంది కాదన్నారు. అధికారులు, ఏఎన్‌ఎంలు ఆశాలను అవమానకరంగా మాట్లాడటం, బెదిరింపులకు గురిచేయడం సరికాదని అన్నారు. ఆన్‌లైన్‌ పనులపై సరైన శిక్షణ ఇవ్వకుండా, పూర్తి బాధ్యత ఆశాలపైనే మోపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో లెప్రసీ సర్వేకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, 2017లో చేసిన పనులకు ఐదు రోజులకు మాత్రమే బిల్లులు చెల్లించి మిగిలిన 16 రోజులకు చెల్లించలేదని తెలిపారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా మళ్లీ సర్వే చేయాలని.. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తీసేస్తామని కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు ఉన్నాయని అధికారులు ఆశాలను బెదిరిస్తున్నారన్నారు. బాలానగర్‌ పీహెచ్‌సీలో ఏడుగురు ఆశాలకు అక్టోబర్‌లో జీరో బిల్లులు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఏఎన్‌సీలు పూర్తిగా చేయలేదు’ అని చెప్పి జీరో వేయడం అన్యాయమన్నారు. ఏఎన్‌సీలు తీసుకురాకపోతే జీరో వేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలు నిరంతరం పని చేస్తూ, వ్యాక్సినేషన్‌లు, డెలివరీలు, సర్వేలు నిర్వహిస్తున్నా వారికి తగిన పారితోషికం ఇవ్వడం లేదని అన్నారు. పారితోషిక ప్రాతిపదికన పని చేస్తున్న కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.అనిత, కార్యదర్శి ఎం.రేవతి కళ్యాణి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.ఉన్నికృష్ణన్‌, జిల్లా కార్యదర్శి ఏ.అశోక్‌, నాయకులు ప్రవీణ, కోమలత, లత, కె.శోభ, రాజ్యలక్ష్మి, మహేశ్వరి, స్వాతి, వసంత, భాగ్య, సునీత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -