Monday, March 16, 2026
E-PAPER
Homeజాతీయంజైలు ప్రయాణ కష్టాలు ముగిశాయి

జైలు ప్రయాణ కష్టాలు ముగిశాయి

- Advertisement -

వాంగ్‌చుక్‌ విడుదలతో ఊరట కలిగింది
ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో స్పందన
న్యూఢిల్లీ :
సామాజిక కార్యకర్త, ఇంజినీర్‌ సోనం వాంగ్‌చుక్‌ విడుదలపై ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో స్పందించారు. ఆయన జైలులో ఉన్న ఆరు నెలలు తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులకు తెర పడిందని వివరించారు. సోనమ్‌ వాంగ్‌చుక్‌ విడుదల అనంతరం ఎక్స్‌ వేదికగా ఆమె భావోద్వేగంగా స్పందించారు. గత ఐదు నెలలుగా ప్రతి వారం జైలుకు రెండు సార్లు ప్రయాణించి గంట పాటు మాత్రమే భర్తను కలుసుకునే పరిస్థితి ఎదురైందని ఆమె వివరించారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ ముగిసినట్టు వివరించారు. తమకు మద్దతుగా నిలిచిన జోద్‌పూర్‌ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 170 రోజులుగా జైలు జీవితం గడిపిన వాంగ్‌చుక్‌ విడుదలతో తాను ఊరట చెందినట్టు వివరించారు. వాంగ్‌చుక్‌ విడుదల గురించి ఆయనకు తెలియజేసేందుకు అనుమతి వ్వాల్సిందిగా జైలు సూపరింటెండెంట్‌కు లేఖ రాస్తున్నట్టు తెలియజేసేలా ఆమె ఒక ఫొటోను కూడా పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హౌదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ అమలు కోరుతూ జరిగిన ఉద్యమాల నేపథ్యంలో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద సోనం వాంగ్‌చుక్‌ను పోలీసులు నిర్బంధించిన విషయం విదితమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆరునెలల తర్వాత విడుదల చేసింది. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి మధ్యాహ్నం ఆయన విడుదలయ్యారు. గతేడాది సెప్టెంబర్‌ 26న లడఖ్‌లో జరిగిన నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద సోనం వాంగ్‌చుక్‌ అరెస్టయ్యారు. ఆయనను జోధ్‌పూర్‌ జైలుకు తరలించారు. లడఖ్‌కు రాష్ట్ర హౌదా ఇవ్వాలనీ, అలాగే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ కింద రక్షణ కల్పించాలని కోరుతూ లేహ్‌ అపెక్స్‌ బాడీ, కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ నేతృత్వంలో ఈ ఉద్యమాలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -