బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’ను ప్రభుత్వం తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. పౌర స్వేచ్ఛను హరించే ఆయుధంగా ఆయన ఈ బిల్లును అభివర్ణించారు. ఇది చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు. బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’ ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు న్యాయ పరిమితులు లేవని ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపర్చారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ‘ఫేక్ న్యూస్’గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలనీ, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలుండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



