Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే నాగేందర్‌ విచారణ 18కి వాయిదా

ఎమ్మెల్యే నాగేందర్‌ విచారణ 18కి వాయిదా

- Advertisement -

మరింత సమయం కావాలి : పిటిషనర్ల న్యాయవాదులు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే నాగేందర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం పిటిషన్లపై న్యాయవాదలు తమ వాదనలు వినిపించాల్సి ఉండింది. అయితే కొంత సమయం కావాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరడంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వచ్చే 18వ తేదీకి వాయిదా వేశారు. విచారణకు పాడికౌశిక్‌రెడ్డి హాజరుకాగా, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాలేదు. అలాగే దానం నాగేందర్‌ సైతం హాజరు కాలేదు. పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్‌ దానం నాగేందర్‌ను పిలిపించారు. ఆయనపై సభాపతి అనర్హత వేటు వేస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు.

దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేశారని.. దానం పోటీ చేసిన దానికంటే పెద్ద ప్రూఫ్‌ ఏముంటుంది? అని ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేననీ, వారి మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ, తాను హాజరైనట్టు తెలిపారు. దానం నాగేందర్‌ అసెంబ్లీ ఆవరణకు వచ్చినా, స్పీకర్‌ కోర్టుకు రాలేదు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిలు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే దానం నాగేందర్‌ తన న్యాయవాదుల ద్వారా స్పీకర్‌కు కౌంటర్‌ దాఖలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాననీ, పార్టీకి రాజీనామా చేయలేదనీ, బీఆర్‌ఎస్‌ తనను సస్పెండ్‌ చేయలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దానం నాగేందర్‌ విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -