Friday, February 6, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో వేడెక్కిన రాజకీయాలు

రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో వేడెక్కిన రాజకీయాలు

- Advertisement -

వర్గపోరు, కోవర్టులు, ఖర్చుల హడావుడి.!
నవతెలంగాణ – రాయికల్

రాయికల్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పట్టణ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వర్గపోరు,అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన అసంతృప్తులు, స్వతంత్రుల సంఖ్య పెరగడం వంటి పరిణామాలతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గాల మధ్య సఖ్యత లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోసిన పలువురు కార్యకర్తలకు బీ-ఫామ్ దక్కకపోవడంతో కొందరు పోటీ నుంచి తప్పుకోగా,మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగారు.

మరోవైపు,గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కొందరికి కాంగ్రెస్ పార్టీ తరఫున బీ-ఫామ్ రావడంతో జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.ఈ పరిస్థితి కారణంగా ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి నుంచీ తమకే బీ-ఫామ్ వస్తుందని సోషల్ మీడియా,వార్డు స్థాయిలో ప్రచారం చేసుకున్న పలువురు అభ్యర్థులు చివరకు టికెట్ దక్కకపోవడంతో అయోమయానికి గురయ్యారు.కొందరు పోటీ నుంచి తప్పుకోగా,మరికొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కారు గుర్తుతో ప్రచారం చేసిన వారు ఇప్పుడు చేయి గుర్తుతో ప్రచారం చేయడం ఓటర్లను కూడా గందరగోళానికి గురి చేస్తోంది.

ఇక కొన్ని రాజకీయ పార్టీల్లో మాత్రం పాత కార్యకర్తలకు కాకుండా ఆర్థికంగా బలమైన వారికి మాత్రమే బీ-ఫామ్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీనితో ఆయా పార్టీల కార్యకర్తలు నిరుత్సాహానికి లోనై, ప్రచారానికి దూరంగా ఉండటం,కొందరు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా,కోవర్టుల వ్యవహారం మరో కీలక అంశంగా మారింది.ఇరు రాజకీయ పార్టీలకు తానే పెద్ద దిక్కునని చెప్పుకునే ఓ వ్యక్తి, ఎమ్మెల్యే వర్గంతోనూ,మాజీ మంత్రి వర్గంతోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కార్యకర్తలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.ఇలాంటి కోవర్టుల చెప్పుడు మాటల వల్ల పార్టీలకు,ముఖ్యంగా నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని వార్డుల్లో విందులు, మద్యం హడావుడి మొదలైందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఒక్కో ఓటుకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం పట్టణమంతా చక్కర్లు కొడుతోంది.జిల్లా కేంద్రంలోని కొందరు పెద్దమనుషుల నుంచి అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి. మరికొన్ని వార్డుల్లో ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఈ అన్ని పరిణామాలను గమనిస్తే, 11వ తేదీన జరగనున్న రాయికల్ మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.చివరకు ఓటుకు నోటు పనిచేస్తుందా? లేక సామాజిక సేవ, వ్యక్తిత్వానికి విలువ ఉంటుందా? అన్నది మాత్రం ఈ నెల 13వ తేదీ ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -