Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారంలో హెలికాప్టర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

మేడారంలో హెలికాప్టర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
పదవులు శాశ్వతం కాదు..
ములుగులో హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం, భూపాలపల్లి జిల్లాలో పర్యటన

నవతెలంగాణ – ములుగు/భూపాలపల్లి
మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి సీతక్క అన్నారు. గతంలో కాలినడక నుంచి ఎడ్ల బండ్లు, కార్ల మీద వచ్చిన భక్తులు నేడు హెలికాప్టర్‌పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ ఏర్పాటుచేసిన హెలికాప్టర్‌ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వధా కాకుండా హెలికాప్టర్‌ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని అన్నారు. హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల నుంచి మేడారం వరకు ఒక్కొక్కరికి రూ.35,999, మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికి రూ.4,800 ధర నిర్ణయించినట్టు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని అన్నారు. కాగా, 10 ఏండ్లుగా తంబి ఏవియేషన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ సర్వీస్‌ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ భారత్‌ రవిచందర్‌, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క తెలిపారు. గురువారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం రూ.3500 కోట్ల పావల వడ్డీ ఎగ్గొట్టిందని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంఘాలను ఇబ్బంది పెట్టకుండా రుణాలు ఇప్పించాలని సోలార్‌ పెట్రోల్‌ బంకులు, క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

అనంతరం భూపాలపల్లిలోని బీసీ బాలుర వసతి గృహంలో జరిగిన సర్పంచుల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల గుండెల్లో నిలవాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే నిధులపై పూర్తి అవగాహన కలిగి, వాటిని సమర్థంగా వినియోగించి సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ఇప్పటికే రూ.237 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్టు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో మంజూరవుతాయని చెప్పారు. వివిధ కార్యక్రమాల్లో మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌, ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అయిత ప్రకాష్‌ రెడ్డి, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రాజబాబు, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ జోన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -