Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఎర్రజెండా వారసత్వాన్ని ప్రజలకు అందించాలి

ఎర్రజెండా వారసత్వాన్ని ప్రజలకు అందించాలి

- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాటంపై విస్తృత అవగాహన కల్పించాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ
నవతెలంగాణ – వనపర్తి 

తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు పోరాటాల వారసత్వాన్ని ప్రజలకు అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వక్ర భాష్యం పలుకుతోందని అన్నారు. సాయుధ పోరాటానికి సంబంధం లేకపోయినా తమ ఆధ్వర్యంలోనే జరిగిందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పిస్తోందని ఆయన విమర్శించారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ రాజు అధ్యక్షతన స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి బిజెపికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంపై దుష్ప్రచారం చేస్తూ, ఆ పోరాటానికి వక్ర భాష్యం పలుకుతూ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి బిజెపి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఆ రోజుల్లో దేశముదురులకు, జాకెట్ దారులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన ఎంతోమంది ఈ పోరాటంలో పాల్గొని విజయం సాధించారన్నారు. పైసా ఇవ్వకుండా అన్ని కులాల వృత్తిదారులతో ఊడిగం చేయించుకోవడాన్ని ఆనాటి కమ్యూనిస్టు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ఆ పోరాటాల్లో భాగంగానే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్యం, నరసింహారెడ్డి తదితరులు ఎందరో ఈ పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షల ఎకరాల్లో భూమిని పంచి దొరలకు, జాగిర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం నడిపారన్నారు.

వారి త్యాగ ఫలితాన్ని కమ్యూనిస్టులు వారసత్వంగా కొనసాగిస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని బిజెపి ఆ పోరాటం తమ ఆధ్వర్యంలోనే జరిగిందన్నట్లుగా ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆనాటి పోరాటయోధుల జయంతులు, వర్ధంతిలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని తెలిపారు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీల నాయకులు, ముఖ్యంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తీరును ప్రజలకు తెలియజేసేలా సభలు, సమావేశాలు పెట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. అవగాహన కల్పించడం ద్వారానే అసత్యాన్ని ఎదుర్కోగలమని ఈ సందర్భంగా సూచించారు.

 పదవ తేదీన ఐలమ్మ వర్ధంతిని, 12వ తేదీన సీతారాం ఏచూరి వర్ధంతిని ఎర్రజెండాలు ఎగరవేసి సభలు సమావేశాల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. సీపీఐ(ఎం) ఉన్న ప్రతి గ్రామంలో శాఖల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేసి గ్రామసభలు జరపాలన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 17 వరకు ముఖ్యమైన గ్రామాలన్నింటిలోనూ తప్పనిసరిగా సెమినార్లు, గ్రామసభలు, బహిరంగ సభలు నిర్వహించి, ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అవసరమైతే చివరి రోజు ప్రతి గ్రామంలోనూ మోటార్ సైకిల్స్ యాత్ర చేపట్టి, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజలను కూడగట్టి, సాయుధ పోరాటం విషయాలను భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

బిజెపి విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. అలాగే దసరా సందర్భంగా నిర్వహించే బతుకమ్మ సంబరాలను, ప్రజాసంఘాలన్నిటి ఆధ్వర్యంలో జన సమీకరణ చేసి బతుకమ్మను ఆడించాలని, ప్రజా చైతన్య గీతాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్ను అమలు చేయాలని కోరుమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతును ప్రకటించిందని, గవర్నర్ ఆ బిల్లును ఆమోదించాలని కోరామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైనంత యూరియాను అందించాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నాలుగు లక్షల టన్నుల యూరియాను ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో సమస్య ఏర్పడిందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నిధులను రాబట్టడంలోనూ బిజెపి నాయకత్వం శ్రద్ధ వహించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రగతికి సహకరించాలని కోరారు. 

 తెలంగాణ సాయుధ పోరాట పోరాట వారోత్సవాల్లో భాగంగా హైదరాబాదులో 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే సభలకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బివి రాఘవులు హాజరవుతారని తెలిపారు. ఆయనతోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అన్ని వామపక్ష పార్టీల నాయకులు హాజరవుతారని తెలిపారు. 17న జనగామ ఖమ్మం జిల్లాలలో నిర్వహించే సభలకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ హాజరవుతారని తెలిపారు. అలాగే నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో నిర్వహించే సభలకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యురాలు బృందాకారత్ హాజరవుతారని, ఈ సభలలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర నాయకులు హాజరవుతారని ఈ సందర్భంగా తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, జిల్లా ముఖ్య నాయకులు మండ్ల రాజు, మేకల ఆంజనేయులు, బొబ్బిలి నిక్సన్, సాయిలీల, ఆది, ఆర్. ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad