తెలంగాణ సాయుధ పోరాటంపై విస్తృత అవగాహన కల్పించాలి
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో యువతను చైతన్య పర్చాలి : సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- వనపర్తి
తెలంగాణలో ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు, పోరాటాల వారసత్వా న్ని ప్రజలకు అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ నాయకులు రాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్రభాష్యం పలుకుతోందన్నారు. ఈ పోరాటంతో సంబంధం లేకపోయినా తమ ఆధ్వర్యంలోనే జరిగిందన్నట్టుగా ప్రజలకు భ్రమ కల్పిస్తోందని విమర్శించారు. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్యం, నరసింహారెడ్డి లాంటివారెందరో నాయకత్వం వహించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల ఎకరాల భూమిని పంచి దొరలు, జాగీర్దారులు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం నడిపారన్నారు. వారి త్యాగ ఫలితాన్ని కమ్యూనిస్టులు వారసత్వంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ ఆనాటి పోరాటయోధు ల జయంతి, వర్ధంతులు నిర్వహిస్తూ ప్రజల ను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీల నాయకు లు ముఖ్యంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తీరును ప్రజలకు తెలియజేసేలా
సభలు, సమావేశాలు పెట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఐలమ్మ వర్ధంతి, 12న సీతారాం ఏచూరి వర్ధంతి, 17న తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా జరుపుకుంటు న్నామని, కాబట్టి 10 నుంచి 17వ తేదీ వరకు గ్రామగ్రామాన ఎర్రజెండాలు ఎగరవేసి సభలు నిర్వహించాలన్నారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో యువత, ప్రజలను కూడగట్టి సాయుధ పోరాటం విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ విషప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, జిల్లా ముఖ్య నాయకులు మండ్ల రాజు, మేకల ఆంజనేయులు, బొబ్బిలి నిక్సన్, సాయిలీల, ఆది, ఆర్‌ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.