పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
డొమెస్టిక్ గ్యాస్ కొరతను నివారించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్యులపై భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్ చేశారు. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని, డొమెస్టిక్ గ్యాస్ కొరతను అరికట్టాలని కోరుతూ.. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముషీరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.జ్యోతి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈనెల 1 నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.195.50 పెంచడం దారుణమన్నారు. దీనివల్ల హోటళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులపై భారం పడి, చివరకు సామాన్య వినియోగదారులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరల మంటతో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లే దుస్థితి దాపురించిందన్నారు.
విదేశాంగ విధానం వల్లే గ్యాస్ కష్టాలు
దేశంలో డొమెస్టిక్ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ విఫలమై, గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోందని జ్యోతి వివరించారు. దేశం ఎదుర్కొంటున్న ఈ గ్యాస్ కష్టాలకు బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ విధానమే కారణమని చెప్పారు. గతంలో అలీన విధానంతో భారత్‌కు ప్రపంచ దేశాల్లో గౌరవం ఉండేదన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు తొత్తుగా మారి, ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండించలేని స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని విమర్శించారు.
రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం
గ్యాస్ నిల్వలు ఉన్నాయంటూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని, కానీ సీఎన్‌జీ దొరక్క 40 శాతం వాహనాలు రోడ్లపైకి రాని పరిస్థితి నెలకొందని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ అన్నారు. దీనివల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోందని చెప్పారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్యాస్ కొరతకు బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానంతోపాటు అమెరికా- ఇజ్రాయిల్ ఇరాన్‌పై చేస్తున్న దురాక్రమణ యుద్ధమే ప్రధాన కారణమన్నారు. భారతదేశ ప్రజలందరూ ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.మహేందర్, కె.ఎన్.రాజన్న, కె.నాగలక్ష్మి, నగర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, జె.కుమారస్వామి, ఎన్.మారన్న, సి.మల్లేష్, జి.నరేష్, ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.



