Monday, December 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహిల్ట్‌ పాలసీని ఆపాలి

హిల్ట్‌ పాలసీని ఆపాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌ : మాజీమంత్రి జగదీశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్‌ పాలసీని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ‘హిల్ట్‌-పీ ఎవరి కోసం-ఎందుకోసం’ అంశంపై టీఎస్‌ఎఫ్‌ ఓ.నరసింహా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు తమకు నచ్చిన వారికి కట్టబెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలి కానీ ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మి పెట్టడానికి ఎందుకు ఆరాటపడుతున్నారని ప్రశ్నించారు. పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్‌ పీ పాలసీని వెంటనే నిలిపివేయాలని, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి దీనిపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్‌చేశారు. భూ దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు తమకు నచ్చినవారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. 5లక్షల కోట్ల ప్రజల ఆస్తిని 440మంది పంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరినీ వదలబోమని అన్నారు. న్యాయ పోరాటం చేసి భూములను కాపాడుతామని తెలిపారు. ప్రజా అవసరాల కోసమే ఇండిస్టీయల్‌ భూములు వినియోగించాలని సూచించారు. హైదరాబాద్‌ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఈ హిల్ట్‌ పి పాలసీ అని ఆరోపించారు. 40 ఏండ్ల క్రితం ప్రభుత్వం నాచారం ఇండిస్టియల్‌ ఏరియాను 700 ఎకరాలతో నిర్మించిందని తెలిపారు. అయితే పొల్యూషన్‌ చేసే కంపెనీలను తరలించాలనే సాకుతో ప్రభుత్వం పొల్యూషన్‌ చేయని కంపెనీలను కూడా తరలించాలని చూస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో ప్రముఖ సామాజిక ఆర్థిక విశ్లేషకులు పాపారావు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్‌ మాజీ చైర్మెన్‌ ఆయాచీతం శ్రీధర్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్‌, రచయిత్రి గోగు శ్యామల, వ్యాపారవేత్త యుగంధర్‌రావు, పాత్రికేయులు రమణకుమార్‌, ప్రభాకర్‌, బైండ్ల విజయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -