Friday, December 26, 2025
E-PAPER
Homeజాతీయంరెచ్చిపోయిన హిందూత్వ శక్తులు

రెచ్చిపోయిన హిందూత్వ శక్తులు

- Advertisement -

క్రిస్మస్‌ రోజున క్రైస్తవులపై దాడులు
అలంకరణలు ధ్వంసం.. వేడుకలకు అడ్డంకులు
జైశ్రీరామ్‌, జై హిందూ రాష్ట్ర అంటూ రెచ్చగొట్టే నినాదాలు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘటనలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికం
చూసీచూడనట్టు వ్యవహరించిన పోలీసులు
ప్రభుత్వాల తీరుపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగను ఎంతో ప్రశాంతంగా జరుపుకుంటున్న వేళ భారత్‌లో మాత్రం హిందూత్వ శక్తులు అలజడిని సృష్టించాయి. వివిధ ప్రాంతాల్లో క్రైస్తవులు, క్రిస్మస్‌ వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. పండుగరోజు వారి వేడుకలకు ఆటంకం కలిగించాయి. పలు హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు ఈ ఘటనల్లో పాల్గొన్నారు. వేడుకలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి మరీ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. నిర్వాహకులు, పాల్గొన్న ప్రజలను బెదిరించారు. రెచ్చగొట్టే నినాదాలు చేశారు. తాజా ఘటనలతో దేశవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో భయాందోళనలు కలిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ ఘటనలు అధికంగా నమోదైనట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భజరంగ్‌దళ్‌ దాడులు
ఛత్తీస్‌గఢ్‌లో హిందూత్వ సంస్థ భజరంగ్‌దళ్‌ క్రిస్మస్‌ వేడులకు ఆటంకం కలిగించింది. రారుపూర్‌లోని మాగెటో మాల్‌ వద్ద ఆ సంస్థ కార్యకర్తలు క్రిస్మస్‌ అలంకరణలను ధ్వంసం చేసింది. దాదాపు 30 మందికి పైగా వచ్చిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు.. రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ద్వేషపూరిత నినాదాలు చేశారు. మాల్‌ ముందు ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్‌ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలతో ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయభ్రాంతులకు గురయ్యారు.

యూపీలో చర్చ్‌ ఎదుట హనుమాన్‌ చాలీసా పఠనం
యూపీలోని బరేలీ పట్టణంలో హిందూత్వ సంస్థలు రెచ్చగొట్టే చర్యలకు దిగాయి. ఆ సంస్థకు చెందిన పలువురు కార్యకర్తలు ఓ చర్చి ఎదుట హనుమాన్‌ చాలీసాను పఠించారు. బరేలీలోని ఒక ప్రసిద్ధ చర్చిలో వేడుకలకు ముందు వారు ఈ చర్యకు దిగారు. అయితే ఇదంతా పోలీసు సిబ్బంది సమక్షంలోనే జరగడం గమనార్హం. అంతేకాదు.. 20 మందికి పైగా హనుమాన్‌ చాలీసా, జైశ్రీరామ్‌ వంటి నినాదాలు చేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో హిందూత్వ సంస్థల తీరు, భద్రత కల్పించలేని యోగి సర్కారు వైఖరిని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.

బీజేపీ సర్కారు అండ.. హిందూత్వ శక్తుల దాడులు
దేశవ్యాప్తంగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల అండతో హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి. క్రిస్మస్‌ వేడుకలకు ఆటంకాన్ని సృష్టించాయి. అనేక ఘటనల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారనీ, సంఘ్‌ పరివార్‌ సంస్థల చర్యలను అడ్డుకునే ప్రయత్నాలను కూడా చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాల మద్దతుతోనే హిందూత్వ శక్తులు క్రిస్మస్‌రోజున రెచ్చగొట్టే చర్యలకు దిగాయనీ, ఇది క్రైస్తవ సమాజాన్ని ఆందోళనకు గురి చేసిందని పలు క్రైస్తవ సంఘాలు, జర్నలిస్టులు, మేధావులు వివరించారు.

చర్చిలో మహిళపై దాడిలో బీజేపీ నేతపై చర్యలేవి?
బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజుల క్రితం ఒక చర్చిలో చూపులేని యువతిపై బీజేపీ నాయకులు కొందరు రెచ్చిపోయారు. ఆమెపై దాడికి దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంజు భార్గవ, ఇతరుల పేర్లు ఈ ఘటనలో వినిపించాయి. అయినప్పటికీ.. వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ పర్వదినాన దాడులకు పాల్పడిన హిందూత్వ చర్యలను పలు క్రైస్తవ సంఘాలు ఖండించాయి. ఇలాంటి సంఘ విద్రోహక చర్యలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలే.. అగ్నికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరించాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

అసోంలో ‘జైశ్రీరామ్‌’ నినాదాలు..
అసోంలోని నల్బారి జిల్లాలో గల సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్న విషయాన్ని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలు తెలుసుకున్నాయి. ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు పాఠశాలలోకి చొచ్చుకెళ్లారు. జైశ్రీరామ్‌, జై హిందూ రాష్ట్ర వంటి నినాదాలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అలంకరణలను ధ్వంసం చేసి, నిప్పంటించినట్టు సమాచారం. వారు దాడులకు కూడా దిగినట్టు తెలుస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -