Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదే

నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదే

- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదు
సిపిఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి 
పాలకుర్తిలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు 
నవతెలంగాణ-పాలకుర్తి

నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటికి కమ్యూనిస్టులదే అని సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు పాతూరి సుగుణక్కతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సిపిఐ నాయకత్వం వహించిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదని విమర్శించారు. 

 నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల అరాచకాలు, ఆగడాలు సహించలేని సాధారణ ప్రజలు  బందూకులు  చేతబట్టి సాయుధ పోరాటం చేసి భూస్వామ్య వ్యవస్థ మెడలు వంచారని అన్నారు. మహత్తరమైన సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాలుగువేల మంది తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు.  వెట్టి చాకిరి వ్యవస్థ రద్దుకై పౌర ప్రజాస్వామిక హక్కుల సాధనకై సాగిన ఈ మహోజ్వలమైన ఉద్యమ ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని అన్నారు. లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పంపిణీ చేయడం జరిగిందని, కౌలు రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కుదారులుగా గుర్తించబడ్డారని తెలిపారు.

ఇంతటి సాహసం, అమరత్వంతో కూడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఉద్యమంలో పాల్గొనని బిజెపి ఇవ్వాలా ఇది హిందూ, ముస్లింల మధ్య జరిగిన సంఘర్షణగా చిత్రీకరించి భవిష్యత్తు తరాలకు తప్పుడు చరిత్రను అందిస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజలపై అణచివేత కొనసాగించటం కోసం మాత్రమే రజాకార్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ చరిత్రపై తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ సినిమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద శక్తులపై తమ భావాజాల పోరాటం ఉదృతం చేస్తామని  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు సొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, హమాలీ సంఘం జిల్లా అధ్యక్షులు చామకూర యాకూబ్, సఖి, సిహెచ్ మల్లేష్, పండుగ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -