ప్రధాని పారిపోవడానికి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నారు
దేశ ప్రజల ప్రయోజనాలను అమెరికాకు తాకట్టుపెట్టారు
మట్టిలో మాణిక్యాలు.. పాలమూరు బిడ్డలు
లక్ష్మీ దేవమ్మ, వరలక్ష్మీలు ఆదర్శప్రాయులు : సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు భార్య వరలక్ష్మి సంస్మరణ సభలో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
పలువురి నివాళి
నవతెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి / వనపర్తి
కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడం, వాటిని కొనసాగించడం, భావితరాలకు ఉద్యమాల బాటను వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా నిలుస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పుట్ట వరలక్ష్మి సంస్మరణ సభ జిల్లా కేంద్ర సమీపంలోని చిట్యాల డీఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ ముందుగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ కుమార్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్ తదితదులు పుట్ట వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్ అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే వరలక్ష్మి ఉద్యమాల బాట పట్టడం, విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న పుట్ట ఆంజనేయులుకు తోడూనీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు.
వరలక్ష్మి జీవితం ఆదర్శమని, పెండ్లి, దాంపత్య జీవితం, ఉద్యమాల ఒరవడి, మరణానంతరం శరీర దానం చేసి సమాజ శ్రేయస్సు కోసమే అంకితమయ్యారనీ, కమ్యూనిస్టుల నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి.. కమ్యూ నిస్టు ఉద్యమానికి పురిటిగడ్డ అని తెలిపారు. గతంలో పార్టీకి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడిన ఉద్యమ నాయకులు లక్ష్మీ దేవమ్మ, వనగంటి ఈశ్వర్ తరహాలోనే ఎంతోమంది పాలమూరు మట్టి బిడ్డలు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. బతికినప్పుడు చేసిన సేవలకన్నా.. మరణించాక శరీర దానానికి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు సహకరించడం సమాజ పురోగతికి దోహదం చేయడమేనని చెప్పారు. ఇలాంటి ఉద్యమ నాయకుల నుంచి వారి ఆదర్శ భావాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ఉద్యమాల బాట పట్టాలని పిలుపుని చ్చారు.
వందేండ్ల చరిత్రగా చెప్పుకుంటున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్.. ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి నేటి అమెరికా సామ్రాజ్య అధిపత్యం వరకూ అంతా తలదించడమే తప్ప ఎదిరించి పోరాడిన చరిత్ర లేదన్నారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, బ్రెజిల్, వెనిజులాలో జరిగిన రాజకీయ పరిణామాలను చూసిన ప్రధాని మోడీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. భవిష్యత్తులో భారత్‌లోనూ అలాంటి తిరుగుబాటు వస్తే తప్పించుకునేందుకు వీలుగా పార్లమెంటు నుంచి తన భవనం వరకు మోడీ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. పదేపదే భారత్‌పై పన్నులు విధిస్తూ ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసేలా అమెరికా వ్యవహరిస్తుంటే, మోడీ మౌనం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత లడఖ్ ప్రజల ఆర్థిక, ప్రజాస్వామ్య, స్వేచ్ఛ, ఉద్యోగ, నిరుద్యోగ భృతి వంటి అన్ని అవకాశాలను కోల్పోయారని అన్నారు. ఇదే పరిస్థితి రేపు జమ్మూ కాశ్మీర్‌లోనూ తలెత్తనున్నదని తెలిపారు. అందుకోసమే భారతదేశంలో వర్గ పోరాటాలు అనివార్యమనీ, అందుకోసం ప్రజా ఉద్యమాలకు ప్రజలను చైతన్యం చేస్తూ కమ్యూనిస్టులు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉంటున్న వరలక్ష్మి దూరం కావడం విచారించదగ్గ విషయమని అన్నారు. ఆమె కోరుకున్న సమాజం కేరళ, చైనా మోడల్ తప్ప, మత ఛాందసవాదంతో ఉన్న మోడీ మోడల్ కాదని తెలిపారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి కంపెనీ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం ఉద్యమాల బాట పడుతుందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్ మాట్లాడుతూ పార్టీకి, మహిళా ఉద్యమానికి చేదోడువాదోడుగా ఉన్న వరలక్ష్మి అకాల మరణం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటని అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తూ ముందుకు నడవడమే ఆమెకు ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్. వినయకుమార్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలోకి వచ్చిన వరలక్ష్మి ఆశయాలను కొనసాగిస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట్రాములు, స్కైలాబ్ బాబు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కిల్లెగోపాల్, సీపీఐ(ఎం) ఉమ్మడి జిల్లా కార్యదర్శులు ఏ రాములు, వర్ధన్ పర్వతాలు, వెంకటస్వామి, పుట్ట వరలక్ష్మి కుమారుడు భరత్, కోడలు లక్ష్మీ ప్రసన్న, కూతురు దివ్య, అల్లుడు స్వామి గోపాల్, అత్తమ్మ పుట్ట బాలమ్మ, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్, నాయకులు జావిద్ అలీ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్, ఉమ్మడి జిల్లా ప్రజా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.