చారిత్రక తొలి మెడల్ ఖాయం
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్
గువహటి : భారత బ్యాడ్మింట్‌లో సీనియర్ షట్లర్లు నిరాశపరిస్తున్నా.. యువ షట్లర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో చారిత్రక మెడల్‌ను ఖాయం చేశారు. గువహటిలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత జట్టు దక్షిణ కొరియాపై మెరుపు విజయం సాధించింది. ఆతిథ్య భారత్ 44-45, 45-30, 45-33తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. ఆఖరు పాయింట్ వరకు ఉత్కంఠగా సాగిన తొలి సెట్‌ను 44-45తో చేజార్చుకున్న టీమ్ ఇండియా.. ఆ తర్వాత వరుస సెట్లలో పుంజుకుంది. సెమీఫైనల్లోకి ప్రవేశించిన భారత్.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. నేడు సెమీఫైనల్లో ఆసియా అండర్-19 చాంపియన్స్ ఇండోనేషియాతో తలపడనుంది. చైనీస్ తైపీపై 45-35, 45-35తో విజయం సాధించి ఇండోనేషియా సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టులో భార్గవ్ రామ్, విశ్వ తేజ, వెన్నెల, రెషిక, ఉన్నతి రాణించారు.