– ఎస్‌ఆర్ శంకరన్, కాకి మాదవరావును ఆదర్శంగా తీసుకోవాలి : రాజీవ్‌గాంధీ సివిల్‌స అభయహస్తం చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టేందుకు యువత కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ బలమైన పెట్టుబడి అని తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ, సన్మాన కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి పాల్గొన్నారు. సివిల్స్ -2025 మెయిన్స్‌కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు రూ. లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సివిల్స్ -2024 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ ఐఏఎస్ ఆఫీసర్ల సేవలు సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సీనియర్ ఐఏఎస్ ఎస్‌ఆర్ శంకరన్, కాకి మాధవరావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వారి సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారని వివరించారు. రాష్ట్రం నుంచి అత్యధిక మంది మెయిన్స్‌లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందుకోసం ఏం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిబద్ధతతో పని చేసే వాళ్లు చరిత్రలో నిలిచిపోతారని గుర్తు చేశారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. మానవీయ కోణంలో పేదల జీవితాల్లో మార్పులకు కారణమైతేనే మన జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపారు. లక్ష్యాలు ఎంత గొప్పవయినా అవి ప్రజలకు చేరకపోతే..ఉపయోగం లేదన్నారు. ముందున్న ప్రతి సవాల్‌ను స్వీకరించాలనీ, సమాజాభివృద్ధి కోసమే ఉండాలన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వం సివిల్స్ అభ్యర్థులకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్‌సింగ్ మక్కన్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ఎనర్జీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES