Sunday, January 25, 2026
E-PAPER
Homeసోపతిఅక్షరాలను మోసుకొచ్చే గుర్రం

అక్షరాలను మోసుకొచ్చే గుర్రం

- Advertisement -

సాధారణంగా గ్రంథాలయం అంటే నాలుగు గోడలు, వరుసగా పేర్చిన పుస్తకాల అల్మారాలు, నిశ్శబ్ద వాతావరణం మన కళ్ళ ముందు మెదులుతాయి. కానీ, ఇండోనేషియాలోని సెంట్రల్‌ జావా ప్రాంతంలో ఒక వింతైన, అందమైన గ్రంథాలయం కనిపిస్తుంది. అది నడుస్తుంది, శబ్దం చేస్తుంది, పిల్లల దగ్గరకు వెతుక్కుంటూ వెళ్తుంది. అదే ‘గుర్రం గ్రంథాలయం’. రిద్వాన్‌ రూరి సురూరి, అతని ప్రియమైన గుర్రం లూనా కలిసి సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం పుస్తకాల పంపిణీ మాత్రమే కాదు, అక్షరాస్యత వైపు వేస్తున్న ఒక బలమైన అడుగు.

రిద్వాన్‌ సురూరి వత్తిరీత్యా గుర్రాలను సంరక్షించే వ్యక్తి (Stable Groomer). జావాలోని పుర్బలింగా ప్రాంతంలో నివసించే ఆయనకు తన గుర్రాలన్నా, తన చుట్టూ ఉన్న గ్రామాలన్నా ఎంతో ప్రేమ. ఒకరోజు అతని స్నేహితుడు ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు… ”నీ దగ్గర ఉన్న గుర్రాలతో సమాజానికి ఉపయోగపడే ఏదైనా పని చేయవచ్చు కదా?” అని. ఆ చిన్న ఆలోచన రూరి మనసులో ఒక పెద్ద మార్పుకు బీజం వేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు పుస్తకాలు చదువుకోవాలనే ఆశ ఉన్నా, సరైన గ్రంథాలయాలు లేవనే నిజాన్ని అతను గుర్తించాడు. ఫలితంగా ‘లైబ్రరీ కుడా’ (గుర్రం గ్రంథాలయం) ఉద్భవించింది.
నాలుగు గిట్టలపై అక్షర యాత్ర: ఈ మొబైల్‌ గ్రంథాలయాలు కొత్తవేమీ కాదు. మన తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు పడవలలో, సైకిల్‌ మీద, ఎడ్ల బండ్ల మీద, స్కూటర్‌ ద్వారా, ప్రస్తుతం వ్యాన్‌ల ద్వారా, నడక (పుస్తకాలు బుట్టలో పెట్టుకుని) ద్వారా పుస్తకాలను మారుమూల ప్రాంతాలకు చేరవేసిన మాట వాస్తవం. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో మొబైల్‌ లైబ్రరీలంటే వ్యాన్లు లేదా బస్సులు గుర్తొస్తాయి కానీ, కొండ ప్రాంతాల్లోని మట్టి రోడ్లు, వరి పొలాల మధ్య వాహనాలు వెళ్లడం కష్టం. అందుకే రూరి తన నమ్మకమైన గుర్రం లూనాను ఎంచుకున్నాడు. లూనా వీపుపై ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క బాక్సులను అమర్చి, వాటి నిండా రంగురంగుల పుస్తకాలను నింపుతాడు. వారం రోజుల్లో కనీసం మూడు సార్లు ఈ జంట గ్రామాల్లో పర్యటిస్తాడు లూనాతో. లూనా నడుస్తుంటే వచ్చే ఆ గిట్టల చప్పుడు ఆ గ్రామీణ పిల్లలకు ఒక పండుగలా అనిపిస్తుంది.



లూనా, పిల్లల ప్రియమైన నేస్తం: ఈ కథలో లూనా పాత్ర కేవలం పుస్తకాలను మోయడమే కాదు, ఒక ప్రధాన ఆకర్షణ కూడా. సాధారణంగా పుస్తకాలు చదవమంటే మొరాయించే పిల్లలు కూడా, లూనాను చూడటానికి పరిగెత్తుకు వస్తారు. లూనా చాలా సాత్వికమైన గుర్రం. పిల్లలు ఆ గుర్రాన్ని నిమురుతూ, దానితో ఆడుకుంటూ పుస్తకాల బాక్సులను వెతుకుతారు. ‘గుర్రం గ్రంథాలయం వచ్చింది!’ అనే కేకలు ఆ వీధుల్లో ప్రతిధ్వనిస్తాయి. గుర్రంపై ఉన్న మక్కువ, మెల్లగా పుస్తకాలపై మక్కువగా మారుతుందని రూరి గ్రహించాడు.

ఇండోనేషియాలో గ్రంథాలయాల కొరత ఉంది. ప్రజా గ్రంథాలయాలు (91,000 అవసరాల్లో కేవలం 26% మాత్రమే). పాఠశాల గ్రంథాలయాలు (287,000 అవసరాల్లో కేవలం 42% మాత్రమే) ఉన్నాయి. గ్రంథాలయానికి ప్రాప్యత లేకపోవడం ఉప-జిల్లా స్థాయిలో కూడా అనుభవించబడుతోంది.
ఇండోనేషియా అంతటా ఉప-జిల్లా స్థాయిలో ఉన్న మొత్తం 7,094 గ్రంథాలయాల అవసరాల్లో సుమారు 6% లేదా 600 గ్రంథాలయాలు మాత్రమే జావా ద్వీపంలో కేంద్రీకతంగా ఉన్నాయి. ఇది జావా బయటి ప్రాంతాల్లో గ్రంథాలయాలు, పుస్తకాలకు ప్రజల యావత్‌ పాత్రను ప్రభావితం చేస్తుంది.
ప్రజా గ్రంథాలయాలు: 91,000 అవసరాల్లో 26%, పాఠశాల గ్రంథాలయాలు 287,000 అవసరాల్లో 42%, ఉప-జిల్లా స్థాయిలో గ్రంథాలయాలు 7,094 అవసరాల్లో 6% (600 గ్రంథాలయాలు) జావా ద్వీపంలో కేంద్రీకతంగా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఇండోనేషియా ప్రభుత్వం గ్రంథాలయాల సంఖ్యను పెంచడానికి, గ్రంథాలయాలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి.

అక్షరాస్యత – ఒక వంతెన:
ఇండోనేషియాలో అక్షరాస్యత రేటు మెరుగుపడుతున్నప్పటికీ, మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పుస్తకాల కొరత ఉంది. పుస్తకాలు కొనాలంటే నగరాలకు వెళ్లాలి, అది పేద కుటుంబాలకు సాధ్యం కాని పని. ఈ లోటును తీర్చడానికి రూరి ఒక వారధిలా మారాడు. అతను కేవలం కథల పుస్తకాలనే కాకుండా, పాఠ్య పుస్తకాలు, విదేశీ భాషా పుస్తకాలు (English classics), సైన్స్‌ పుస్తకాలను కూడా సేకరించి గ్రామాలకు చేరుస్తున్నాడు. దీనివల్ల నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ద్వారా కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు.
సామాజిక ఐక్యత, ఉత్సాహం: లూనా ఒక గ్రామంలో ఆగగానే, అక్కడ ఒక మినీ ఫెస్టివల్‌ కనిపిస్తుంది. చెట్టు నీడలోనో, మసీదు మెట్ల మీదో పిల్లలంతా గుమిగూడుతారు. పెద్ద విద్యార్థులు చిన్నవారికి కథలు చదివి వినిపిస్తారు. తల్లిదండ్రులు కూడా తమ పనులను పక్కన పెట్టి, పిల్లలు ఏం చదువుతున్నారో ఆసక్తిగా గమనిస్తారు. చదవడం అనేది అక్కడ ఒక వ్యక్తిగత పని కాదు, అది ఒక సామాజిక కార్యక్రమంగా మారింది. ఒకరికొకరు పుస్తకాలను మార్చుకుంటూ, కథలను చర్చించుకుంటూ గ్రామీణ సమాజం విజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది.

దాతల సహకారం, విస్తరణ: ప్రారంభంలో రూరి సొంతంగా కొన్ని పుస్తకాలతో మొదలుపెట్టినప్పటికీ, అతని నిస్వార్థ సేవను చూసి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దాతలు ముందుకు వచ్చారు. నేడు లూనా వీపుపై ఉన్న బాక్సుల్లో వేలాది కథలు ఉన్నాయి. అల్‌ జజీరా వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఈ కథను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ గుర్రం గ్రంథాలయం వల్ల కొన్ని వందల మంది పిల్లలు తమ ఊరిలోనే ఉండి ప్రపంచ విజ్ఞానాన్ని అందుకుంటున్నారు.
గ్రంథాలయ రక్షకుడు(Protector of the Written Word): రిద్వాన్‌ సురూరి కేవలం ఒక గుర్రం యజమాని మాత్రమే కాదు, అతను ‘లిఖిత పదం’ రక్షకుడు. అక్షరాస్యతను వ్యాప్తి చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన 24 మంది గొప్ప వ్యక్తుల కథలతో రూపొందించిన Protectors of the Written Word అనే పుస్తకంలో రూరి కథ ప్రత్యేకంగా చోటు చేసుకుంది. ఇది అతనికి దక్కిన గౌరవం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మార్పు కోరుకునే వారికి ఒక సందేశం.



మనకేమి నేర్పిస్తుంది: రిద్వాన్‌, లూనా కథ మనకు ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. మార్పు తీసుకురావడానికి మన దగ్గర విలాసవంతమైన వనరులు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మంచి మనస్సు వుంటే చాలు.. రిద్వాన్‌ ఒక గుర్రం, కొన్ని పుస్తకాలతో ఒక తరానికే విజ్ఞానాన్ని అందించవచ్చు అని నిరూపించాడు. సురూరి తన వత్తిని (గుర్రాల సంరక్షణ), సామాజిక బాధ్యతను ఎంత అందంగా మేళవించాడో చూడండి.
గోడలు లేని, గిట్టల చప్పుడుతో సాగే ఈ గ్రంథాలయం మనకు ఒక ఆశను కలిగిస్తుంది. సాధ్యం కాదని ఏదీ లేదు, మనం ఒక అడుగు ముందుకు వేస్తే, ప్రకతి, సమాజం మనకు తోడుగా నిలుస్తాయి. రూరి, లూనా ప్రయాణం నిరంతరం సాగాలని, మరెంతో మంది పిల్లల కళ్లలో జ్ఞాన కాంతులను నింపాలని మనం ఆకాంక్షిద్దాం.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -