Wednesday, October 1, 2025
E-PAPER
Homeఆటలువేట మొదలైంది

వేట మొదలైంది

- Advertisement -

– శ్రీలంకపై భారత్‌ ఘన విజయం
– దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
– ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌

ఆతిథ్య జట్ల సమరంలో అదిరే విజయం సాధించిన భారత్‌ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ వేటను ఘనంగా మొదలెట్టింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో టీమ్‌ ఇండియా ఆకట్టుకుంది. తొలుత భారత్‌ 47 ఓవర్లలో 269/8 పరుగులు చేయగా.. శ్రీలంక ఛేదనలో 45.4 ఓవర్లలో 211 పరుగులకు కుప్పకూలింది. 59 పరుగుల తేడాతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం పొరుగు దేశం పాకిస్తాన్‌తో కొలంబో వేదికగా తలపడనుంది.

నవతెలంగాణ-గువహటి

ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసింది. తొలుత 53 పరుగుల ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన దీప్తి శర్మ.. తర్వాత మూడు వికెట్లతో మాయాజాలం చేసింది. దీంతో మంగళవారం గువహటిలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లో సహా ఆతిథ్య శ్రీలంకపై భారత్‌ 59 పరుగుల తేడాతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఘన విజయం సాధించింది. దీప్తి శర్మకు తోడు స్నేV్‌ా రానా (2/32), శ్రీ చరణి (2/37) మాయ చేయటంతో శ్రీలంక ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు శ్రీలంకపై ఒత్తిడి పెంచారు. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (43, 47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నీలాక్షిక సిల్వ (35, 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా శ్రీలంక బ్యాటర్లలో ఎవరూ రాణించలేదు. 45.4 ఓవర్లలో 211 పరుగులకు శ్రీలంక ఛేదనకు తెరపడింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 47 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (37, 59 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హర్లీన్‌ డియోల్‌ (48, 64 బంతుల్లో 6 ఫోర్లు) సహా దీప్తి శర్మ (53, 53 బంతుల్లో 3 ఫోర్లు), ఆమన్జోత్‌ కౌర్‌ (57, 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర (4/46) నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. గ్రూప్‌ దశలో భారత్‌ విజయంతో అదిరే ఆరంభం అందుకుంది. గ్రూప్‌ దశలో ఏడు మ్యాచుల అనంతరం టాప్‌-4లో నిలిచే జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి.

మాయ చేశారు
270 పరుగుల భారీ ఛేదనలో శ్రీలంకకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్‌ హాసిని పెరీరా (14) రెండు ఫోర్లతో దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (43) సహజశైలిలో మెరిసింది. పవర్‌ప్లేలో 30/0తో సాగుతున్న ఇన్నింగ్స్‌ను పేసర్‌ క్రాంతి గౌడ్‌ కుదిపింది. ఓపెనర్‌ హాసిని వికెట్‌తో భారత్‌కు బ్రేక్‌ అందించింది. ఆటపట్టు, హర్షిత సమరవిక్రమ (29)లు రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. దీంతో శ్రీలంక ఛేదనలో రేసులోనే నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న ఆటపట్టును దీప్తి శర్మ సాగనంపగా… తెలుగమ్మాయి శ్రీ చరణి సైతం మ్యాజిక్‌లో జతకలిసింది. . హర్షితను ఎల్బీగా అవుట్‌ చేసిన శ్రీ చరణి.. శ్రీలంక పతనానికి నాంది పలికింది. ఆ తర్వాత లంక అమ్మాయిలు వరుసగా వికెట్లు కోల్పోయారు. స్నేV్‌ా రానా, దీప్తి శర్మలు సైతం మిడిల్‌ ఓవర్లలో మాయాజాలం చేయటంతో.. శ్రీలంక చేతులెత్తేసింది. మిడిల్‌ ఆర్డర్‌లో గుణరత్నె (11), దిల్హారి (15), అనుష్క (6), సుగంధిక కుమారి (10) తేలిపోయారు. నీలాక్షిక సిల్వ (35) కాస్త ప్రతిఘటించినా.. ఓటమి అంతరం మాత్రమే కుదించగలిగింది. టెయిలెండర్లు ఆచిని కులసూరియ (17), ప్రబోధిని (14) భారత్‌ విజయాన్ని ఆలస్యం చేశారు. 45.4 ఓవర్లలో 211 పరుగులకు శ్రీలంక కుప్పకూలింది.

దీప్తి ధనాధన్‌
టాస్‌ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న స్మతీ మంధాన (8) రెండు ఫోర్లతో మెరిసినా.. ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయింది. మంధాన నిష్క్రమణ పవర్‌ప్లే స్కోరుపై ప్రభావం చూపింది. తొలి పది ఓవర్లలో భారత్‌ 45 పరుగులే చేసింది. యువ ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (37), హర్లీన్‌ డియోల్‌ (48) జోడీ రెండో వికెట్‌కు 96 బంతుల్లో 67 పరుగులతో అర్థ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (21), జెమీమా రొడ్రిగస్‌ (0), రిచా ఘోష్‌ (2) నిరాశపరిచారు. దీంతో 124/6తో భారత్‌ కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (53), ఆమన్జోత్‌ కౌర్‌ (57)లు ఏడో వికెట్‌కు 99 బంతుల్లోనే 103 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఆమన్జోత్‌ కౌర్‌ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 బంతుల్లో అర్థ సెంచరీ బాదగా.. దీప్తి శర్మ మూడు ఫోర్ల సాయంతో 50 బంతుల్లో ఫిఫ్టీ అందుకుంది. స్నేV్‌ా రానా (28 నాటౌట్‌, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ ఎనిమిదో వికెట్‌కు 22 బంతుల్లోనే 42 పరుగులు పిండుకుని ఆఖర్లో విలువైన స్కోరు వేగం పెంచారు. 47 ఓవర్లలో 8 వికెట్లకు భారత్‌ 269 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక బౌలర్లలో రణవీర నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుంది.

సంక్షిప్త స్కోరు వివరాలు :
భారత మహిళల ఇన్నింగ్స్‌ : 269/8 (ఆమన్జోత్‌ కౌర్‌ 57, దీప్తి శర్మ 53, హర్లీన్‌ డియోల్‌ 48, రణవీర 4/46)
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్‌ : 211/10 (చమరి ఆటపట్టు 43, నీలాక్షిక సిల్వ 35, దీప్తి శర్మ 3/54, శ్రీ చరణి 2/37)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -