Tuesday, January 20, 2026
E-PAPER
Homeక్రైమ్భార్య, కూతురు గొంతు కోసి.. భర్త ఆత్మహత్యాయత్నం

భార్య, కూతురు గొంతు కోసి.. భర్త ఆత్మహత్యాయత్నం

- Advertisement -

– భార్య మృతి.. భర్త, బిడ్డ పరిస్థితి విషమం
– వివాహేతర సంబంధమంటూ భార్యపై భర్త అనుమానం
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌

వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య, కూతురు గొంతుకోసి హత్య చేసి తానూ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సిద్దిపేటలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త, బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దూల్మిట్ట మండలం బెక్కల్‌ గ్రామానికి చెందిన దున్నపోతుల ఎల్లయ్య.. అతని భార్య శ్రీలత (32), కూతురు హర్షిత(16), కొడుకు అజరుతో కలిసి సిద్దిపేట పట్టణంలో పదేండ్లుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం పనికోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఎల్లయ్య.. పది రోజుల క్రితం మళ్లీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్‌లో కూలి పని చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా మొదటి నుంచి భార్యపై అనుమానంతో ఉన్న అతను.. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చి నిద్రలో ఉన్న భార్య శ్రీలతతో పాటు కూతురు హర్షిత గొంతు కోశాడు. వారు ప్రతిఘటించడంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో వారిని కొట్టాడు. అప్పటికీ ప్రాణాలు పోలేదని పురుగుల మందు తాగించాడు. ఈ సంఘటనతో భయపడిపోయిన అజరు.. ఇంట్లో నుంచి బయటపడి.. ఇరుగుపొరుగువారికి సమాచారం ఇచ్చాడు. కాలనీవాసులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. దాంతో భయాందోళనకు గురైన ఎల్లయ్య.. తాను సైతం గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాగా, బాధితులను హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలోనే శ్రీలత మృతి చెందగా, హర్షిత, ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. హర్షిత.. మిట్టపల్లి కేజీబీవీలో టెన్త్‌ క్లాస్‌ చదువుతుండగా, అజరు హైదరాబాద్‌ కీసరలో 8వ తరగతి చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌ రెడ్డి, టూ టౌన్‌ సీఐ ఉపేందర్‌ పరిశీలించారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -