-భావి తరాలకు మార్గదర్శకులు
నవతెలంగాణ – రాయికల్
గురువు కనిపించే ప్రత్యక్ష దైవం. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని భావించి,చిన్నప్పుడే చక్కటి భావనలు మనసులో రూపొందిలా కొందరు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. మండలంలో కొందరు ఉపాధ్యాయులు అంతా కలిసి ఏళ్ల తరబడి పాఠశాలలను నాణ్యంగా నిర్వహిస్తూ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తున్నారు. మరికొందరు టీచర్లు తమ సబ్జెక్టులో ఏ పాఠశాలలో బోధించిన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా పాఠాలు చెబుతున్నారు. మరికొందరు ఉపాధ్యాయులు స్వయంగా బోధనోపకరణాల సాయంతో విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా పాఠాలు బోధిస్తూ అవార్డులను అందుకుంటే కొందరు బోధకులు ప్రస్తుత టెక్నాలజీని వినియోగించుకొని (ఏఐ) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్నారు.గురువుల ఆకాంక్షను అందిపుచ్చుకొని విద్యార్థులు క్రమశిక్షణగా ఎదగాలని కోరుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం..
మండలంలోని యం.పి.పి.ఎస్ చెర్లకొండాపూర్ లో పని చేస్తున్న ఎస్.జి.టి ఉపాధ్యాయుడు దొంగ జితేందర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్నారు,స్వగ్రామం మహితాపూర్.తాను పనిచేస్తున్న పాఠశాలలోనే తన ఇద్దరు కుమారులైన శ్రావణ్ దీప్ రెడ్డి, కరణ్ దీప్ రెడ్డిలను 5వ తరగతి వరకు చదివిపించి అందరికి ఆదర్శంగా నిలవడంతో గత సంవత్సరం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా సత్కారం పొందారు.ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మండల రిసోర్స్ పర్సన్ గా సేవలందిస్తున్నారు.
రాయికల్ పట్టణానికి చెందిన కడకుంట్ల అభయ్ రాజ్ ప్రస్తుతం కుమ్మరిపల్లి ఎంపిపియస్ లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. 2012 నుండి ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పనికిరాని,ప్లాస్టిక్ వస్తువులతో బోధనోపకరణలను ప్రణాళికతో స్వయంగా తయారు చేసి విద్యార్థులకు సులువుగా,ఆకర్షణీయంగా బోధిస్తూ..పలువురి ప్రశంసలు పొందారు. సౌతర్న్ సైన్స్ ఫెయిర్ లో ఈ ఏడాది పాండిచ్చేరి విద్యాశాఖ కార్యదర్శి ద్వారా అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం తన కూతురు తనూశ్రీ(4)ని కూడా తనతోపాటుగా ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్ గా సేవలందిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అక్కినపెల్లి సతీష్ 22 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తూ మండలంలోని ఆలూరు ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో గ్రీన్ బోర్డులను వాడుతునే సాంకేతికత ను ఉపయోగించుకుంటూ ఆ ప్రభుత్వ పాఠశాలను మండలంలో ముందు వరుసలో ఉంచుతున్నారు. సినీరంగం పై పట్టు ఉండటంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన (ఏ.ఐ) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు జి కాంప్రెస్,ఎడ్యుకేటివ్8, మింటి మీటర్,కోడ్ మిత్ర ఆప్ ల ద్వారా ఏ.ఐలో విద్యార్థులకు పూర్తి శిక్షణను అందిస్తున్నారు. పాఠశాలలో జరిగే నిత్య కార్యక్రమాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఆ పాఠశాలకు సంబధించి ఎస్ టివి యూ ట్యూబ్ ఛానెల్ సైతం ప్రారంభించారు. ఏ.ఐ జిల్లా రిసోర్స్ పర్సన్ గా శిక్షణ పొంది సేవలందిస్తున్నారు.