శ్రామిక జనం గొంతెత్తి పోరాడాలి : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్
ఘనంగా శ్రామిక ఉత్సవ్ ప్రారంభం
నవతెలంగాణ- విశాఖ
పాలకులు దేశంలో మను వాదాన్ని అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. సమస్య లపై శ్రామిక జనం గొంతెత్తి పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఈ నెల 31 నుంచి జనవరి నాలుగు వరకూ జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభను పురస్కరించుకుని బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వెనుక ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం నుంచి తలపెట్టిన శ్రామిక ఉత్సవ్ ఘనంగా ఆరంభమైంది. సీఐటీయూ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అధ్యక్షత వహించిన ఈ ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఆయనతో పాటు వేదికపై గల అతిథులంతా కలిసి శ్రామికవర్గ సంస్కృతికి దర్పణంపట్టేలా యుద్ధభేరిని డ్రమ్స్ కొట్టి ప్రారంభించారు.
ప్రకాశ్‌రాజ్ ‘లాల్ సలాం.. జై భీమ్’ అని అభివాదం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన మాటలతో సభికుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపారు. అంతా ‘లాల్ సలామ్.. జై భీమ్’ అనడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. సీఐటీయూకు, తనకూ గల బంధం ఈనాటిది కాదని, తన చిన్నప్పటి నుంచీ ఉందని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. 18 ఏండ్ల వయసులోనే వీధి నాటికలు వేస్తూ శ్రమజీవుల చైతన్యం కోసం ఊరూరా తాను తిరిగానని వివరించారు. ఈ వేదికపై కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు చూస్తే తన చిన్ననాటి వీధి నాటికల గురుతులు కండ్ల ముందు మెదిలాడుతున్నాయన్నారు. గతంలో శ్రామికుల గురించి… చెమట చుక్కకు ఓటమి లేదు అనేవారని, నేడు ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా శ్రామికులకు బతికే పరిస్థితి లేదని ప్రకాశ్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కార్పొరేట్లను పెంచడం వల్లే ఈ స్థితి నెలకొందన్నారు. సంస్కృతి పరిస్థితి చూస్తే.. భారత దేశం సరోవరం అయితే అందులో కనిపించే కమలం బీజేపీ కాగా, దాని వేర్లు ఆర్‌ఎస్‌ఎస్ అని తెలిపారు. బీజేపీపై పోరాడటమే కాకుండా వేళ్లూనుకుని ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌పైనా పోరాడాలని పిలుపునిచ్చారు.
విశాఖ వచ్చాక ఇక్కడ పోరాడేవారిపై ప్రభుత్వ నిర్బంధం గురించి విన్నానని తెలిపారు. బంధించిన ప్పటికీ హక్కుల కోసం కార్మికుల గొంతు వినిపిస్తూ ఉంటుందన్నారు. తాను సినీ యాక్టర్‌ని అయినా కార్మిక గొంతే వినిపిస్తానని స్పష్టం చేశారు. ప్రవాహంలో కొట్టుకుపోయే చేపల్లా కాకుండా ఎదురీదే చేపలా పోరాడుతానన్నారు. సీఐటీయూ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గఫూర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న సెక్యులరిస్ట్ ప్రకాశ్‌రాజ్ అని కొనియాడారు. శ్రమ అవార్డును ప్రకాశ్‌రాజ్ నుంచి ప్రముఖ శ్రామిక కవి తెలకపల్లి రవి ఈ వేదికపై స్వీకరించారు. వేదికపై సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు, సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, లీడర్ పత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి, ఫిల్మ్ మేకర్ సత్యానంద్, ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న, సీఐటీయూ నాయకులు కందారపు మురళి, బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ కె.రమాప్రభ ఉన్నారు.
విజ్ఞాన, సాహిత్య వేదికల సందడి
పుస్తక ప్రియులు, కళాకారుల కోసం ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను ప్రము ఖులు ప్రారంభించారు. పుస్తక మహోత్సవాన్ని ఆచార్య వెలమల సిమ్మన్న ప్రారంభించారు. సాహిత్య వేదికను సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, షార్ట్ ఫిలిం ప్రదర్శనను స్టార్ మేకర్ సత్యానంద్, సైన్స్ ఎగ్జిబిషన్‌ను డాక్టర్ ఆర్‌వీఎస్.సుబ్రహ్మణ్యం, కార్టూన్ ప్రదర్శనను సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, ఫొటో ప్రదర్శనను సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు ప్రారంభించారు.
పద పద విశాఖ… శ్రామిక జన పతాక
ఉత్తేజంగా ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్
ప్రారంభమైన కళా, విజ్ఞాన, సాహిత్య వేదికలు
‘పద పద విశాఖ … శ్రామిక జన పతాక’ అంటూ శనివారం రాత్రి విశాఖపట్నంలో శ్రామిక ఉత్సవ్ ఘనంగా ఆరంభమైంది. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు, చేసిన నృత్యాలు సభికుల్లో ఉత్సాహం నింపాయి. ప్రముఖ రచయిత నల్లి ధర్మారావు రచించిన ‘పద పద విశాఖ’ గేయాన్ని 15 మంది ప్రజానాట్యమండలి కళాకారుల బృందం ఆలాపించింది. ‘లేబర్ కోడ్ల ఉచ్చు, కార్మిక భవితకు చిచ్చు’ అన్న పాట కార్మికుల హక్కులను పాలకులు ఎలా హరిస్తున్నదీ వివరించింది. మత్స్యకారుల జీవన విధానాన్ని స్పృజించేలా భీమిలికి చెందిన కళాకారుడు పోతురాజు ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన ‘జాలారి నృత్యం’ లయబద్ధంగా సాగింది. ‘అజాదీ..అజాదీ’ అంటూ సాగిన పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మహిళా కళాకారులు నయీం కైలాస్, సంగీత, చేతన, పాయల్, భావన, రంజన్, రీటా తదితరుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి భారీగా కార్మికులు, మేధావులు, కళాకారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ డప్పుకొట్టి ఉత్సవ్‌ను ప్రారంభించారు.



