Sunday, October 12, 2025
E-PAPER
Homeఆటలుమాయ మొదలైంది

మాయ మొదలైంది

- Advertisement -

రవీంద్ర జడేజాకు 3 వికెట్లు
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 140/4
శుభ్‌మన్‌ గిల్‌ అజేయ సెంచరీ
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 518/5 డిక్లేర్డ్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ
బ్యాటర్లు, బౌలర్లు మెరుపు ప్రదర్శనలతో కదం తొక్కగా వెస్టిండీస్‌తో రెండో టెస్టుపై భారత్‌ పట్టు బిగించింది. యశస్వి జైస్వాల్‌ (175, 258 బంతుల్లో 22 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (129 నాటౌట్‌, 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక మోత మోగించగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (43, 54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (44, 79 బంతుల్లో 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో రాణించారు. బ్యాటర్లు సమిష్టిగా రాణించగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 పరుగులకు డిక్లరేషన్‌ ప్రకటించింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/37), కుల్‌దీప్‌ యాదవ్‌ (1/45) మాయాజాలంతో వెస్టిండీస్‌ విలవిల్లాడింది. జడేజా, కుల్‌దీప్‌ దెబ్బకు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 378 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. నేడు తొలి రెండు సెషన్లలోపే విండీస్‌ను ఆలౌట్‌ చేసి ఫాలోఆన్‌ ఆడించే వ్యూహంలో భారత్‌ కనిపిస్తోంది.

జడేజా మాయజాలం
టీ విరామానికి ముందు బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌ ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు జాన్‌ కాంప్‌బెల్‌ (10), చందర్‌పాల్‌ (34) కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కాంప్‌బెల్‌ రెండు ఫోర్లతో ఆకట్టుకోగా.. చందర్‌పాల్‌ సైతం బౌండరీలు సాధించాడు. దీంతో కరీబియన్‌ శిబిరంలో సానుకూల వాతావరణం ఏర్పడింది. కానీ పేసర్లతో కొత్త బంతిని పంచుకున్న లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా.. మ్యాజిక్‌ చేశాడు. జడేజా మాయలో కరీబియన్‌ బ్యాటర్లు గింగిరాలు తిరిగారు. ఓపెనర్లు కాంప్‌బెల్‌, చందర్‌పాల్‌ సహా రోస్టన్‌ ఛేజ్‌ (0)ను జడేజా సాగనంపాడు. క్రీజులో కుదురుకున్న మెరుగ్గా ఆడుతున్న నం.3 బ్యాటర్‌ అలిక్‌ (41)ను చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ వెనక్కి పంపాడు. 107/4తో వెస్టిండీస్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. షారు హోప్‌ (31 నాటౌట్‌), వికెట్‌ కీపర్‌ టెవిన్‌ (14 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించారు.

శుభ్‌మన్‌ శతకం
ఓవర్‌నైట్‌ స్కోరు 20తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ శతక మోత మోగించాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (175) ద్వి శతకం సాధించేలా కనిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఎదురుదాడి చేయాల్సి తరుణంలో వికెట్ల మధ్య సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్క్రమించాడు. రెండో రోజు ఆటలో 2 పరుగులే జోడించిన జైస్వాల్‌ నిరాశగా నిష్క్రమించాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (43, 54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ జోరు చూపించగా.. గిల్‌ సైతం దూకుడుగా ఆడాడు. 9 ఫోర్లతో 95 బంతుల్లో 50 పరుగులు చేసిన గిల్‌.. 13 ఫోర్లు, 1 ఓ సిక్సర్‌తో 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. నితీశ్‌ అవుటైనా.. ధ్రువ్‌ జురెల్‌తో కలిసి గిల్‌ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. జురెల్‌ (44) ఐదు ఫోర్లతో గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. వెస్టిండీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ జోమెల్‌ వారికన్‌ (3/98) మూడు వికెట్లు పడగొట్టాడు. రోస్టన్‌ ఛేజ్‌ (1/83) ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు.

స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (రనౌట్‌) 175, రాహుల్‌ (స్టంప్డ్‌) టెవిన్‌ 38, సుదర్శన్‌ (ఎల్బీ) వారికన్‌ 87, గిల్‌ నాటౌట్‌ 129, నితీశ్‌ (సి) సీయల్స్‌ (బి) వారికన్‌ 43, జురెల్‌ (బి) ఛేజ్‌ 44, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (134.2 ఓవర్లలో 5 వికెట్లకు) 518 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-58, 2-251, 3-325, 4-416, 5-518.
బౌలింగ్‌ : జైడెన్‌ 22-2-88-0, అండర్సన్‌ 17-2-71-0, గ్రీవ్స్‌ 14-1-58-0, ఖారీ పీయరీ 30-2-120-0, జోమెల్‌ వారికన్‌ 34-6-98-3, రోస్టన్‌ ఛేజ్‌ 17.2-0-83-1.
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ : జాన్‌ కాంప్‌బెల్‌ (సి) సుదర్శన్‌ (బి) జడేజా 10, చందర్‌పాల్‌ (సి) రాహుల్‌ (బి) జడేజా 34, అలిక్‌ (సి) జడేజా (బి) కుల్‌దీప్‌ 41, హోప్‌ నాటౌట్‌ 31, ఛేజ్‌ (సి,బి) జడేజా 0, టెవిన్‌ నాటౌట్‌ 14, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (43 ఓవర్లలో 4 వికెట్లకు) 140.
వికెట్ల పతనం : 1-21, 2-87, 3-106, 4-107.
బౌలింగ్‌ : బుమ్రా 6-3-18-0, సిరాజ్‌ 4-0-9-0, జడేజా 14-3-37-3, కుల్‌దీప్‌ 12-3-45-1, వాషింగ్టన్‌ 7-1-23-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -