Monday, March 30, 2026
E-PAPER
Homeజాతీయంసర్వేల మాయ

సర్వేల మాయ

- Advertisement -

కొందరి అభిప్రాయాలు దేశ ప్రజలందరికీ ఆపాదన
మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా వెల్లడించిన మార్నింగ్‌ కన్సల్ట్‌
ఆన్‌లైన్‌ సర్వేలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించవు
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదుపులో లేని ధరలు
అయినా.. ప్రజాదరణ ఎలా సాధ్యం?
లోపాలను బయటపెడుతున్న నిపుణులు, విశ్లేషకులు

న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడంటూ తరచూ బీజేపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంటుంది. ఇందుకు ఏదో ఒక సర్వే సమాచారాన్ని చూపిస్తుంది. దీనిని సోషల్‌ మీడియాలో కాషాయపార్టీ ఊదరగొడుతుంటుంది. ఇదే నిజమనేలా ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తుంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరలు, పూర్తిగా నెరవేరని హామీలు.. ఇన్ని సమస్యల మధ్య ఒక ప్రధాని ప్రజల ఆదరణను పొందడం ఎలా సాధ్యం? కేవలం ఆన్‌లైన్‌ సర్వేలో కొన్ని శాంపిల్స్‌ ఆధారంగా ఒక దేశాధినేత ప్రజాదరణను కొలవడం ఎంత వరకు కరెక్ట్‌? కొంత మంది అభిప్రాయాలను దేశ ప్రజలందరి భావనగా ఆపాదించడం సబబు ఎలా అవుతుంది? అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి సర్వేల్లో ఉన్న లోపాలను వారు బయటపెడుతున్నారు. మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రస్తుతం మీడియా చేస్తున్న ప్రచారం అమెరికా సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ నిర్వహించిన సర్వే ఆధారంగా వస్తోంది. ఈ సంస్థ రూపొందించిన ‘గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ ట్రాకర్‌’ నుంచి గణాంకాలు వచ్చాయి. 68 శాతం అప్రూవల్‌ రేటింగ్‌తో మోడీ ఈ ఘనత సాధించాడని సర్వే పేర్కొంది. ఈ సర్వేను మార్చి 2-8 మధ్య నిర్వహించారు. వాస్తవానికి ఈ సంస్థ ఒక ప్రయివేటు, లాభాపేక్ష సంస్థ. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ సర్వే విధానం, దాని పరిమితులు పరిశీలిస్తే ఈ సంస్థ వెల్లడించిన ఈ క్లెయిమ్‌పై పరిశీలకులు, విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సర్వే ఎలా పని చేస్తుంది?
ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో కొన్ని వందల మందిని అడిగి అభిప్రాయాలు సేకరిస్తారు. ఏడు రోజుల సగలు (రోలింగ్‌ యావరేజ్‌) తీసుకుని నాయకుల అప్రూవల్‌ రేటింగ్స్‌ ప్రకటిస్తారు. ఇందులో భాగమయ్యేవారు స్వచ్ఛందంగా పాల్గొనే వ్యక్తులే. అయితే ఇందులో వినిపించే ప్రధాన సమస్య… సర్వే అభిప్రాయాలను మొత్తం భారత ప్రజల అభిప్రాయంగా చూపెట్టడం. అయితే ఈ విధానాన్ని విశ్లేషకులు, నిపుణులు తప్పుబడుతున్నారు. ఎందుకంటే.. ఈ సర్వేలో పాల్గొనేవారు ప్రధానంగా ఇంటర్నెట్‌ కలిగినవారు, చదువుకున్నవారు, పట్టణ ప్రజలు అధికంగా ఉంటారు. మరి సర్వేలో పాల్గొననీవారి అభిప్రాయాల సంగతేంటి? అని నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సర్వేలు దేశంలో ఉన్న 140 కోట్ల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించవని వారు బలంగా చెప్తున్నారు.

సర్వేలో ఉన్న ముఖ్యమైన లోపాలు
సర్వేలో ర్యాండమ్‌ శాంప్లింగ్‌ లేదనీ, ఇది నిజమైన గణాంకాలను, సమాచారాన్ని ప్రతిబింబించదని నిపుణులు చెప్తున్నారు. ఇక సర్వే సంస్థలు వెయిటేజీ మీద ఆధారపడతాయి. అంటే తాము చేసిన సర్వే గణాంకాలు సరిపోలనప్పుడు.. సంస్థలు ‘లెక్కల సవరణ’ చేస్తాయి. ఇక వాటి వద్ద పూర్తి సమాచారం ఉండుదు. పారదర్శకతకు స్థానం తక్కువ. గ్రామీణ, పేద, అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఇలాంటి సర్వేల్లో తక్కువగా ఉంటుంది. ఇలాంటి లోపాలతో కూడిన సర్వేలు ఇచ్చే అప్రూవల్‌ రేటింగ్స్‌ ఒక నాయకుడి ప్రజాదరణకు కొలమానం కాలేవు.

భారత్‌లో ఉన్న సమస్య ఏంటి?
భారత్‌లో డిజిటల్‌ డివైడ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం తక్కువ. కులం, మతం, ఆర్థిక స్థితి ప్రభావం ఎక్కువ. కాబట్టి ఈ సర్వేలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలు ఇలాంటి సర్వేలను కచ్చితమైన ప్రజాభిప్రాయంగా చూడకూడదనీ, పార్టీల తప్పుడు ప్రచారాలకు ప్రభావితం కాకూడదని సూచిస్తున్నారు.

దేశాల మధ్య పోలిక తప్పు
భారత ప్రధాని మోడీని అమెరికా, యూరప్‌ వంటి ఇతర దేశాల నాయకులను పోల్చడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే… ప్రతి దేశంలోనూ ఇంటర్నెట్‌ వినియోగం భిన్నంగా ఉంటుంది. అక్కడి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. సర్వే పద్దతులు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఒక దేశాన్ని మరొక దేశంతో, ఒక దేశ అధినేతను ఇంకో దేశ అధినేతతో పోల్చే విధానం సరికాదని విశ్లేషకులు వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -