Friday, May 23, 2025
Homeమానవిచిత్రం భ‌ళారే విచిత్రం

చిత్రం భ‌ళారే విచిత్రం

- Advertisement -

”తొలి వలపే తీయనిది, మదిలో ఎన్నడూ మాయనిది” అంటూ పాడిన కథానాయిక గుర్తుందా… తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణిక, సామాజిక చిత్రాల్లోని పాత్రల్లో జీవించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నాటి మేటి నటుల సరసనే కాదు, ఆ నాటి వర్ధమాన కథానాయకులతోనూ మురిపించారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, పలు భాషల్లో నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకుని వివాహం తర్వాత కొన్నాళ్ళు నటనా జీవితానికి విరామం ఇచ్చారు. తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు. ఆమె సీనియర్‌ నటి ప్రభ. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రస్థానం నేటి మానవిలో…
ప్రభ పూర్తి పేరు కోటి సూర్య ప్రభ. అయితే ప్రభగా ఆమె అందరికీ నుపరిచితురాలు. ఈమె తెనాలిలో సుబ్రహ్మణ్యం, రమణమ్మ దంపతులకు మే 23, 1961లో జన్మించారు. లలిత కళల్లో ప్రావీణ్యమున్న ఇంట్లో పుట్టడం వల్ల ప్రభకు బాల్యంలోనే నాట్యం నేర్పించారు. కూచిపూడి ఆర్ట్‌ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. ప్రభ మొదటి సారి 1974లో విడుదలైన భూమికోసం సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే ఆ సినిమా కంటే ముందు ‘నీడలేని ఆడది’ సినిమా విడుదలైంది. దాంతో ఇదే ఆమె తొలి చిత్రంగా చెప్పుకుంటారు.
కూచిపూడి కళాకారిణిగా
ప్రభ అద్భుతమైన కూచిపూడి కళాకారిణి. అమెరికాలో సుమారు 40కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ‘అమ్మాయిలు జాగ్రత్త, అన్నదమ్ముల కథ, రామయ్య తండ్రి, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు’ వంటి చిత్రాలలో ద్వితీయ నాయికగా ప్రభ నటించారు. అలాగే అక్కినేని ‘మహాకవి క్షేత్రయ్య’లో క్షేత్రయ్య మరదలు రుక్మిణిగా నటించారు. యన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన పౌరాణిక చిత్ర ‘దానవీరశూర కర్ణ’లో రారాజు సుయోధనుని భార్య భానుమతి పాత్రలో నటించారు. అందులో ‘చిత్రం భళారే విచిత్రం..’ అంటూ సాగే పాటలో ఎన్టీఆర్‌ సరసన నటించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ప్రభ పేరు మారుమోగిపోయింది. అప్పటి వరకు సైడ్‌ హీరోయిన్‌గా ఉన్న ప్రభ కొన్ని చిత్రాలలో మెయిన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం పొందారు.
బాధను భరిస్తూనే…
ఈమెని చూడగానే ఎవరికైనా మన పక్కింటి అమ్మాయి అనే భావన కలుగుతుంది. ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగి ఆమె కాలికి గాయమైంది. ప్రభ సినిమా షూటింగ్‌ చేస్తుండగా కారు బోల్తా పడి రేడియేటర్‌ నుండి మరిగే నీళ్లు ఆమె కాళ్ళపై పడి బాగా కాలింది. అంత ప్రమాదం జరిగినా కూడా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ షూటింగ్‌ పూర్తి చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆమె ఆ కాలిన గాయాల నొప్పిని భరించారు. ఈమె నటించిన ఒక్కొక్క చిత్రం ఒక్కో ఆణిముత్యం అనే చెప్పవచ్చు. ఎక్కువ పౌరాణిక చిత్రాలలో నటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. మహాకవి క్షేత్రయ్య చిత్రంలో ”జాబిల్లి చూసేను.. నిన్ను నన్ను.. నాకెంత సిగ్గయే బావ..” అనే పాట అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. అందులో ఆమె చాలా చక్కగా అభినయించారు. 2003లో ఆర్‌.నారాయణమూర్తి నిర్మించిన ‘వేగుచుక్కలు’ సినిమాలో ప్రభ నటనకుగాను నంది అవార్డ్‌ అందుకున్నారు. అంతేకాక ప్రత్యేక జ్యూరీ అవార్డ్‌ కూడా అందుకున్నారు.
ప్రముఖుల ప్రోత్సాహంతో…
ఎన్టీఆర్‌, దాసరి, రాఘవేంద్రరావు వంటి దర్శకులు ప్రభను ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్టీఆర్‌ ‘శ్రీమద్విరాట పర్వము’లో సత్యభామగా నటించారామె. అలాగే ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లో వేమన ఎపిసోడ్‌లో విశ్వదగానూ కనిపించారు. అలాగే ‘సింహం నవ్వింది’లో ఎన్టీఆర్‌ సరసన ప్రత్యేక పాత్రలో నటించారు. ఇక ఏయన్నార్‌ సరసన ‘మహాత్ముడు’లో కీలక పాత్ర పోషించారామె. ‘కృష్ణతో ‘కొల్లేటి కాపురం’లో నాయికగా నటించారు. ఇప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభ.

పలు కీలకపాత్రల్లో…
జగన్మోహిని, ఆమెకథ, ఇంటింటి రామాయణం, ఇదెక్కడి న్యాయం, కోరికలే గుర్రాలయితే, పార్వతీ పరమేశ్వరులు, సంధ్యారాగం, నేను మా ఆవిడ, సంతోషీమాత మహత్మ్యం, మనిషికో చరిత్ర, శ్రీవినాయక విజయం వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందించిన ‘ఇదెక్కడి న్యాయం’లో హరికథా భాగవతారిణిగా ప్రభ అభినయం ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో సుమారు 125కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.
సేకరణ : పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -