Saturday, July 26, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ తోటల్లో వంద్యత్వ మొక్కల ప్రభావం..

పామాయిల్ తోటల్లో వంద్యత్వ మొక్కల ప్రభావం..

- Advertisement -

30 ఏళ్ళ పంట దిగుబడి ప్రశ్నార్ధకం..
నాలుగేళ్ళ రైతు శ్రమ వృధా..
ఆయిల్ ఫాం గ్రోయర్స్ పోరాట ఫలితం…
కదిలిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం…
రంగంలోకి శాస్త్రవేత్తలు బృందం…
నివేదిక అనంతరం పరిహారం కోసం మరో పోరు…
ఆయిల్ ఫాం రైతుసంఘం రాష్ట్ర కన్వీనర్ పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నో ఆశలు, ఆశయాలతో ఎంతో ప్రేమా ఆత్మీయతతో అల్లారు ముద్దుగా కనిపెంచిన పిల్లలు కొంత వయస్సు వచ్చాక రోగాలు బారిన పడినా, సరైన క్రమంలో ప్రయోజకులు కాకపోయినా ఆ తల్లిదండ్రులు మనోవేదన ఎంత ఉంటుందో…అలాగే 30 సంవత్సరాలు పాటు పంట ఫలసాయం ఇచ్చే ఉద్యాన పంటలు అయిన మామిడి, కొబ్బరి, పామాయిల్ ను మొక్క నుండి ఫలాలు ఇచ్చే వరకు పోషించిన తర్వాత ఆ చెట్లలో పూయని, కాయని చెట్లు ఉన్నా ఆ రైతుకు అంతే ఆవేదన ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. నిజంగా అలాంటి మొక్కలు న్న రైతులు మొహాలు చూస్తుంటే ఎంతో బాధా కలుగుతుంది.

విషయానికి వస్తే పామాయిల్ తోటల్లో పూ,కాత లేని మొక్కలు ఉన్నాయని,దీంతో రైతు శ్రమ వృధా అవుతుందని ,అంతే గాక రైతు ఆర్ధికంగా నష్టపోతున్నారని గుర్తించిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ గత నాలుగైదు ఏండ్లుగా అధికారులకు వినతులు,కార్యాలయాల ముందు నిరసనలు,కేంద్ర రాష్ట్ర స్థాయి అధికారిక,అనధికారిక పెద్దలు తో సంప్రదింపులు ఫలితంగా ఐఐఓపీఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆయిల్ ఫాం రీసెర్చ్ – భారతీయ పామాయిల్ పరిశోధనా మండలి ) పెదవేగి ప్రధాన శాస్త్రవేత్త ఎం.వీ ప్రసాద్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందంలో వంద్యత్వానికి కారణాలు ఏమిటో నిగ్గు తేల్చడానికి రంగంలో దిగింది.

వాస్తవానికి 1990 నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ సాగు ప్రారంభం అయి నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో ముందుగా విస్తరించింది.కానీ ఈ వంద్యత్వ మొక్కలు రావడం మాత్రం 2016 నుండి 2019 వరకు నాడు ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారిగా విధులు నిర్వహించిన రాజశేఖర్ రెడ్డి హయాం లోనే రైతులకు ఇచ్చిన మొక్కల్లో మాత్రమే వంద్యత్వ మొక్కలు ఎందుకు వచ్చాయనే ది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

అసలు దీని వెనుక ఏమి జరిగింది?

నాడు వేడిచేసి నాసిరకం,రోగిష్టి మొక్కలను నాశనం చేయమని శాస్త్రజ్ఞులు,ఉద్యాన అధికారులు ఆదేశించినా వాటిని ఎందుకు కర్లింగ్ చేయలేదనే ది అంతుబట్టని విషయమే.పామాయిల్ మొక్కల పెంపకం లో ఎంతో  అనుభవం ఉన్న,హార్టికల్చర్ అధికారులను బదిలీ చేసి నర్సరీ మొత్తం బాధ్యత ను ఫ్యాక్టరీ నిర్వహించే మెకానికల్ ఇంజనీరింగ్ స్టాఫ్ కు ఎందుకు అప్పగించారు?

ఇదంతా పెద్ద ప్లాన్ ప్రకారం జరిగిందా?

కర్లింగ్ మొక్కలను, జన్యు లోపం ఉన్న మొక్కలను రైతులకు ఇవ్వటానికి అభ్యంతరం పెట్టిన ఉద్యోగులు వాటిని నాశనం చేయండి అని డిమాండ్ చేసినా వినకుండా రాజశేఖర్ రెడ్డి ఆ లక్ష ఆఫ్ టైప్ మొక్కల బాధ్యతను తనకు అనుకూలం గా పని చేసే వారితో వాటిపై ఖరీదైన, మరియు మనుషులకు హానికారకమైన మైథిలో బాక్టీరియా, బయో కన్సార్టియా, ఎంజీబీ సొల్యూషన్ లాంటి ప్లాంట్ గ్రోత్ స్టిమలెంట్స్ ను వాడి, వాటిని రైతులకు ఎందుకు ఇచ్చారు? ఇవే మొక్కలు ఇప్పుడు రైతుల తోటల్లో కాయకుండా ఎరెక్ట్ గ్రోత్ మొక్కలు గా దర్శనం ఇస్తున్నాయి అనేది తేట తెల్లం అయింది.

మరి దీనికి బాధ్యులు ఎవరు? నాడు విధుల్లో ఉన్న డీఓ రాజశేఖర్ రెడ్డి నా?

ఆ నర్సరీలు నిర్వహణ బాధ్యత లు తీసుకున్న ఆయిల్ ఫెడ్ అధికారులా? రైతుల కు ఆ మొక్కలను ఇస్తున్నా మౌనం గా ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది నా? ఇదంతా జరుగుతున్నా తెలిసి కూడా ప్రోత్సహించిన జనరల్ మేనేజర్ నా? రెండు సంవత్సరాలు గా రైతులు,రైతు సంఘం నాయకులు ఆఫ్ టైప్ మొక్కలు తోటల్లో 30% ఉన్నాయని పోరాడుతున్నా అవి మంచి మొక్కలే అని రైతులను,రైతు సంఘం నాయకులను,ప్రైవేటు కంపెనీల బ్రోకర్లు అని అవమానించిన ఆయిల్ ఫెడ్ ఎండీ లేక ఆయిల్ ఫెడ్ చైర్మన్ నా?

ఇంకా ఎన్నో అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇప్పటి వరకూ 3000 ఎకరాల లో ఈ మొక్కలు ఉన్నట్లు ప్రాధమిక అంచనా వచ్చారు.నేటి వరకూ ఆయిల్ ఫెడ్ కు వంద్యత్వ మొక్కలు తమ తోటల్లో ఉన్నాయని 110 మంది రైతులు ఆయిల్ ఫెడ్ కు దరఖాస్తు చేసుకున్నారు.ఈ హాఫ్ టైప్ మొక్కలు ఎక్కువ గా 2016 – 2017  సీజన్ నుండి 2021- 2022 వరకూ మొక్కలు ఇచ్చిన తోటలలో నే  గుర్తించారు.ఈ మొక్కలను వంద్యత్వ మొక్కలు రైతు స్థాయి లో తోట లో గుర్తించాలి అంటే  మొక్కలు నాటి కనీసం 3 ఏళ్ళు పూర్తి అయితే గాని గుర్తించలేరు.

ఆయిల్ పామ్ రైతు సంఘం జన్యు లోపం మొక్కల నష్టపరిహారం పై జరిపిన పోరాటం లో కొన్ని ముఖ్యమైన సందర్భాలు. 14 జులై 2023 లో నాటి వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి జన్యు లోపం మొక్కల పై విచారణ జరిపి దోషులను శిక్షించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అని కోరటం జరిగింది. 6 ఏప్రిల్ 2024 నాడు ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఆఫ్ టైప్ మొక్కల పై విచారణ నష్టపరిహారం పై విజ్ఞప్తి.

15 ఏప్రిల్ 2024 అప్పటి ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖల భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా అధికారికి  పై విషయం పై విజ్ఞాపన. 22 జూన్ 2024 న వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు విజ్ఞప్తి. 29 జూన్ 2024 న అప్పటి ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా కు పై విషయం పై వినతి. 6 జనవరి 2025 న మాజీ మంత్రి హరీష్ రావు కు విషయం పై విజ్ఞప్తి.

17 మార్చి 2025 అశ్వారావుపేట లో పర్యటించిన ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ జాతోట్ హుస్సేన్ నాయక్ కు గిరిజన నాయకులు, గిరిజన రైతులు తరుపున కారం శ్రీరాములు, మడివి బాలరాజు, కోండ్రు మురళి  ద్వారా పై విషయం పై పిర్యాదు చేసారు.దీని పై ఆయిల్ ఫెడ్ పై కేసు రిజిస్టర్ అయింది.

26  మార్చి 2025  కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ద్వారా కలిసి అప్పటి వరకు గుర్తించిన 34 మంది ఆఫ్ టైప్ మొక్కలు బాధితుల తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలతో విచారణ జరిపించి నష్టపరిహారం ఇప్పించాలి అని కోరారు.

27 మార్చి 2025 సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కి ఆయిల్ పామ్ రైతుల సమస్యల మీద దృష్టి సారించి ఆయిల్ పామ్ రైతుల తరుపున పోరాడాలి అని కోరారు. 9 ఏప్రిల్ 2025 న సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తో కలిసి అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ డివిజనల్  ఆఫీస్ వద్ద ఈ జిల్లాలో నే ఆయిల్ పామ్ రిఫైనరీ కట్టాలి అని, జన్యుపరమైన లోపం మొక్కల బాధితులకు నష్టం పరిహారం ఇవ్వాలి అని ధర్నా నిర్వహణ.

24 ఏప్రిల్ 2025 ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి జన్యు లోపం ఉన్న మొక్కల బాధితుల  14 తోటలను పరిశీలించి,లోపం ఉన్న మాట వాస్తవమే కాని రైతులకు నష్టపరిహారం ఇవ్వటానికి చట్టం లో వెసులు బాటు లేదు అని చెప్పారు. 20 మే 2025 వ్యవసాయ చైర్మన్ కోదండ రెడ్డి కి ఆయిల్ పామ్ మొక్కను కూడా విత్తన చట్టం లో పెట్టాలి అని,ఆయిల్ పామ్ మొక్కలు లోపం వస్తే మొక్క ఇచ్చిన కంపెనీ నష్ట పరిహారం ఇచ్చేలా చట్టం లో చర్చలు అని విజ్ఞప్తి.

24 మే 2025 భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్  బాధిత రైతుల తోటలను పరిశీలించి సంఘీభావం తెలిపారు. 25 మే 2025 భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ దినేష్ కులకర్ణి కి ఆయిల్ పామ్ రైతుల సమస్యలు వివరించి వారి మద్దతు కోరటం,వారు హామీ ఇవ్వడం జరిగింది.

31 జూన్ 2025 భారతీయ కిసాన్ సంఘ్ సహకారం తో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా స్టేట్ మీడియా ద్వారా ఆయిల్ పామ్ రైతుల సమస్యలు, ఆఫ్ టైప్ మొక్కల బాధితుల కష్టాలను వివరించారు. 14 జూన్ 2025 బీజేపీ కి చెందిన జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి బాధిత రైతుల తోటలు చూసి సమస్య పరిష్కారానికి వారి సంఘం ద్వారా మద్దతు ఇస్తాము అని హామీ ఇచ్చారు. 17 జూన్ 2025 తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ తీగల సాగర్ గారు బాధిత రైతుల తోటలు సందర్శించి రైతుల  తోటలను సందర్శించి వారి సమస్యల పై పోరాటానికి మద్దతు ఇచ్చారు.

23 జూన్ 2025 ఎస్టీ జాతీయ కమిషన్ కేసు విచారణ కు కారం శ్రీరాములు మరికొందరు గిరిజన రైతుల కు సహకారం గా రైతులు ఆయిల్ ఫెడ్ వలన, ఆఫ్ టైప్ మొక్కల వలన నష్టపోయిన విధానం కమిషన్ కు వివరించి,ఆయిల్ ఫెడ్ చెప్పేవి అన్నీ అబద్దాల అని ఆధారాలతో నిరూపించి 71 మంది ఆయిల్ పామ్ ఆఫ్ టైప్ బాధిత రైతుల తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలతో విచారణ జరిపి నెల రోజులలో నివేదిక కమిషన్ కు ఇవ్వాలి అని, 2016 నుండి ఇప్పటి వరకు వేసిన అందరి ఆయిల్ పామ్ తోటల పరిస్తితి పై సమగ్ర నివేదిక ఇవ్వాలి అని కమిషన్ ఆదేశించడం మన రైతు సంఘం విజయం గా భావిస్తున్నాం.

27 జూన్ 2025 ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు కు ఇచ్చిన లెటర్ లో పేర్కొన్న 34 మంది రైతుల తోటల లో కొన్నింటిని పరిశీలించి సమస్య ఉన్న మాట వాస్తవమే అని గ్రహించి, సమగ్ర విచారణకు వస్తాము అని హామి ఇచ్చారు.

2 జులై 2025 ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎంవీ ప్రసాద్,డాక్టర్  రామచంద్రుడు,డాక్టర్ కళ్యాణ్ బాబు, ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ  అడపా కిరణ్  బృందం 2,3,4 తేదీలలో అశ్వారావుపేట, ములకలపల్లి,దమ్మపేట మండలాల్లో 12 తోటల్లో ఆయిల్ పామ్ మొక్కలు పరిశీలించి సుమారు 100 శాంపిల్ లను పరిశోధన  నిమిత్తం సేకరించారు.

16 జులై 2025 ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు బృందం రెండోవ విడత వేంసూరు,సత్తుపల్లి మండలాల్లో రెండు రోజులు పర్యటించి 14 తోటలను పరిశీలించి సుమారు 70 శాంపిల్స్ సేకరించారు.

తెలంగాణ సెక్రటేరియేట్,కొత్త భవనం నిర్మాణ సమయం లో, బూర్గుల రామకృష్ణ భవన్ లో,అప్పటి, ఇప్పటి అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు,అప్పటి హార్టికల్చర్ కమిషనర్ హనుమంతరావు, హార్టికల్చర్ అధికారిణి సరోజినీ దేవి తో ఒక గంటా ముప్పై నిముషాల పాటు (1.30 )

ఆయిల్ పామ్ లో అన్ని సమస్యల పై  చర్చ జరిగింది. అందులో నర్సరీ లో అవకతవకలు,తీసుకో వలసిన చర్యలు,పవర్ ప్లాంట్ లు కట్ట వద్దు ఫైబర్ మొత్తం రైతులకు ఇవ్వాలి,జీవన ఎరువులు, రీసెర్చ్ సెంటర్  రైతులకు అన్నిటికీ ఆన్ లైన్ యాప్ అన్నిటి మీద స్పష్టమైన హామీ తో ఆ మీటింగ్ ముగిసింది. కానీ 3 ఏళ్ళు కావస్తున్నా ఒకటి రెండు మినహా ఏమి అమలు కాలేదు.ఆ రోజు ఈ చర్చ లో తుంబూరు మహేశ్వర రెడ్డి, పుల్లయ్య,మద్దినేని వెంకట్, సూరిబాబు పాల్గొన్నారు.

అయితే నివేదిక ఎపుడు ఇస్తారు?పరిష్కారాలు ఏమి సూచిస్తారు అనే వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -