Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్టారిఫ్‌ల ప్రభావం తక్కువే..

టారిఫ్‌ల ప్రభావం తక్కువే..

- Advertisement -

– రుణాల విస్తరణకు చర్యలు
– ఉచిత వాణిజ్య ఒప్పందాలపై దృష్టి
– ఆర్బీఐ గవర్నర్‌ మల్హోత్ర
– రేపటి నుంచే 50 శాతం సుంకాల అమలు

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ఫై విధించిన అధిక సుంకాల్లో మొత్తం ఎగుమతిదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే.. ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్లోత్రా మాత్రం టారిఫ్‌ల ప్రభావాన్ని తక్కువగా చేసి మాట్లాడారు. యుఎస్‌ విధించిన 50 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలపై మల్హోత్ర మాట్లాడుతూ.. యుఎస్‌ టారిఫ్‌లతో ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఫిక్కీ- ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎఫ్‌ఐబీఏసీ 2025 వార్షిక బ్యాంకింగ్‌ సమావేశంలో మల్హోత్ర మాట్లాడుతూ.. యూఎస్‌ టారిఫ్‌లు దేశీయ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తే ఆర్బీఐ తగిన విధాన చర్యలతో స్పందిస్తుందన్నారు. ”మేము బ్యాంకింగ్‌ రంగానికి తగినంత నగదు లభ్యతను అందించాము. ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాలకు మద్దతును ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము. ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే మరోవైపు ఆర్థిక వృద్ధిపై దృష్టి కోల్పోలేదు.” అని మల్హోత్ర అన్నారు.

భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మల్హోత్ర ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ వద్ద ఇప్పటికే 695 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయని.. ఇవి 11 నెలల విదేశీ వాణిజ్యానికి సరిపోతాయన్నారు. సుంకాల మొత్తం ప్రభావం తక్కువగా ఉంటుందని మల్హోత్ర తెలిపారు. అయితే.. రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్‌, దుస్తులు, ఎంఎస్‌ఎంఈ రంగాలపై కొంత ప్రభావం ఉండవచ్చన్నారు. ప్రభుత్వం ఉచిత వాణిజ్య ఒప్పందాలపై కూడా దృష్టి సారిస్తోందన్నారు. వృద్ధికి తమ వంతుగా ఇప్పటికే రెపోరేటును 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించిందని గుర్తు చేశారు.

అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అంశాలను అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. బ్యాంక్‌ రుణాలను విస్తరించేందుకు అవసరమైన చర్యలను తాము పరిశీలిస్తున్నామన్నారు. పెట్టుబడుల సైకిల్‌ను సృష్టించేందుకు వీలుగా కార్పొరేట్‌లు, బ్యాంక్‌లు ఓ తాటి పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే దేశాభివృద్ధి ముందుకెళ్తుందని మల్హోత్ర అన్నారు. ధరల స్థిరీకరణ, ఆర్థికవృద్దే లక్ష్యంగా ద్రవ్య పరపతి విధానం కొనసాగుతుందన్నారు. స్థూలంగా భారత ఆర్థికవ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad