Sunday, March 15, 2026
E-PAPER
Homeజాతీయంచిన్న పరిశ్రమలపై యుద్ధం ఎఫెక్ట్‌

చిన్న పరిశ్రమలపై యుద్ధం ఎఫెక్ట్‌

- Advertisement -

గ్యాస్‌ కొరతతో కుదేలవుతున్న పరిస్థితి
టెక్స్‌టైల్‌, ఆటోమొబైల్‌, ప్లాస్టిక్‌ రంగాల్లో పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు
సంక్షోభానికి ముందస్తు ప్రణాళిక కరువు
పరిస్థితిని అంచనా వేయడంలో కేంద్రం విఫలం
మోడీ సర్కారుపై పరిశ్రమ వర్గాల్లో విమర్శలు

న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల యుద్ధోన్మాదం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. దేశంలోని పరిశ్రమలపైనా యుద్ధం ఎఫెక్ట్‌ పడుతోంది. హార్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా భారత్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా అంతరాయం ఏర్పడడంతో టెక్స్‌టైల్‌, ప్లాస్టిక్‌, ఆటోమొబైల్‌ వంటి రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికుల ఉపాధి కూడా దెబ్బ తినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ముందుగా అంచనా వేయడంలో విఫలమైందనే విమర్శలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి.

‘హార్ముజ్‌’ ద్వారా భారత్‌కు 90 శాతం ఎల్పీజీ
అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల తర్వాత ఇరాన్‌ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి కనిపించిన విషయం విదితమే. దాడులు, ప్రతిదాడుల కారణంగా ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గమైన హార్ముజ్‌ జలసంధి ఆంక్షలను ఎదుర్కొంటున్నది. ఇందులో పరిమిత దేశాలకు మాత్రమే అనుమతి ఉన్నట్టు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఈ మార్గం భారత్‌కూ చాలా కీలకం. ఎందుకంటే ఈ మార్గం ద్వారానే భారత్‌కు సరఫరా అయ్యే ఎల్పీజీలో దాదాపు 90 శాతం వస్తుంది.

పరిస్థితిని అంచనా వేయడంలో కేంద్రం విఫలం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు యుద్ధానికి దొగొచ్చనే వార్తలు గత కొన్ని నెలల నుంచి కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముప్పును ముందుగానే అంచనా వేయాల్సిన మోడీ సర్కారు.. అందులో విఫలమైందని విశ్లేషకులు చెప్తున్నారు. యుద్ధానికి ముందు ఇజ్రాయిల్‌ దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రధాని మోడీ… ఆ తర్వాత అటు వైపుగా చర్యలు తీసుకోలేదని వివరిస్తున్నారు. కేంద్రం నిర్లక్ష్యంతో దేశంలోని పరిశ్రమలకు గ్యాస్‌ కొరత ఏర్పడిందని అంటున్నారు.

మూతపడుతున్న పరిశ్రమలు.. ఆగిపోతున్న పనులు
యుద్ధంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో దేశంలోని చిన్న పరిశ్రమలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక ఫౌండ్రీ యజమాని తమకు రోజుకు ఐదు గ్యాస్‌ సిలిండర్లు అవసరమవుతాయనీ, అవి లేకుండా తాము పని చేయలేమని చెప్తున్నారు. హర్యానాలోని పానిపట్‌లో టెక్స్‌టైల్‌ డైయింగ్‌ యూనిట్లకు గ్యాస్‌ లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. అక్కడ సుమారు 10వేల టెక్స్‌టైల్‌ యూనిట్లు ఉండగా.. వాటిలో దాదాపు వెయ్యి డైయింగ్‌ యూనిట్లను ఆపేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

చిన్న పరిశ్రమల యజమానులు, కార్మికులపై ప్రభావం
గ్యాస్‌ కొరతతో పాటు ముడి సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. పెట్రోలియం ఆధారిత పాలిస్టర్‌ దారాలు, ప్లాస్టిక్‌ బ్యాగుల ధరలు పెరిగాయి. ప్లాస్టిక్‌ తయారీలో ఉపయోగించే ‘దాణా’ ధరలు కొన్ని ప్రాంతాల్లో 50 శాతం వరకు ఎగబాకాయి. ఆటోమొబైల్‌ రంగానికి అవసరమైన స్టీల్‌ ధరలు కూడా 10-15 శాతం పెరిగాయి. దీంతో చిన్న పరిశ్రమల యజమానులు ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కొందరు ఇప్పటికే ఉత్పత్తి తగ్గించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్మికుల పనివేళలను కూడా తగ్గించే పరిస్థితి కూడా రావచ్చన్ని పరిశ్రమల వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు తాత్కాలిక నష్టాలను భరించగలవు. కానీ చిన్న పరిశ్రమలు మాత్రం కొన్ని రోజుల గ్యాస్‌ కొరతకే మూతపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. ”పరిశ్రమలకు ప్రత్యేక గ్యాస్‌ కోటా ఇవ్వాలి. ధరల పెరుగుదలను నియంత్రించాలి. చిన్న పరిశ్రమలకు ఆర్థిక సహాయం ప్రకటించాలి. లేకపోతే ఈ సంక్షోభం పరిశ్రమలు మూతపడటానికి, నిరుద్యోగం పెరగడానికి దారి తీయొచ్చు” అని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనైనా కేంద్రం చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించాలని సూచిస్తున్నారు.

మోడీ సర్కారు దూరదృష్టి లోపం
భారత్‌లో నెలకొన్న ఈ పరిస్థితి యుద్ధ ప్రభావమే కాదనీ, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా లోపం కూడా అని విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవానికి భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ఇంధన దిగుమతి దేశాలలో ఒకటి. అలాంటి దేశం యుద్ధ పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు ముందుగానే సిద్ధం చేయాలి. వ్యూహాత్మక గ్యాస్‌ నిల్వలు పెంచాలి. చిన్న పరిశ్రమలకు అత్యవసర మద్దతు ప్యాకేజీలు ప్రకటించాలి. అయితే మోడీ ప్రభుత్వం నుంచి ఈ చర్యలేవీ కనిపించకపోవటం గమనార్హం. ఈ పరిస్థితి ఇంధన భద్రతపై ప్రభుత్వ దూరదృష్టి లోపం, చిన్న పరిశ్రమల పట్ల విధానాల్లో నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -