10వేల పైగా సర్వీసులు రద్దు
పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం కారణంగా భారత్‌కు చెందిన విమాన కంపెనీలు వేల సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదివేలకు పైగా సర్వీసులను రద్దు చేసుకున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ అసంగ్బా చుబా ఆవో వెల్లడించారు. ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో భారతీయ విమాన సంస్థలు పశ్చిమాసియా దేశాలకు రోజుకు 300 నుండి 350 విమానాలను నడిపేవని.. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 80 నుండి 90 పడిపోయిందని ఆయన మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. యుద్ధ ప్రభావంతో ప్రధాన విమాన మార్గాల్లో అంతరాయం కలగడం, భద్రతా కారణాల దృష్ట్యా సర్వీసులను భారీగా తగ్గించాల్సి వచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్ ఉమ్మడి దాడులతో మొదలైన ఈ ఉద్రిక్తతలు విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. సర్వీసుల సంఖ్య ఇంత భారీగా తగ్గడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడమే కాకుండా.. విమానయాన సంస్థల ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. భద్రతకే తాము తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని అసంగ్బా చుబా ఆవో తెలిపారు.
విమానాలపై యుద్ధ ప్రభావం
- Advertisement -
- Advertisement -



