Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుమచ్చలేని మహానేత వీఎస్‌ అచ్యుతానందన్‌

మచ్చలేని మహానేత వీఎస్‌ అచ్యుతానందన్‌

- Advertisement -

కేరళలో అందరితోనూ గౌరవించబడ్డ వ్యక్తి
ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కీలక పాత్ర
ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశ రాజకీయాల్లో మచ్చలేని మహానేత వీఎస్‌. అచ్యుతానందన్‌ అని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరోసభ్యులు బీవీ.రాఘవులు చెప్పారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆదర్శాలను పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని చెప్పారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో అచ్యుతానందన్‌ చిత్రపటానికి బీవీ.రాఘవులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సీపీఐ(ఎం) ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన వారిలో ఆయనొకరని గుర్తుచేశారు. ఆ 32 మందిలో చివరన మరణించిన వారు అచ్యుతానందనే అని అన్నారు. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా సైద్ధాంతిక, ప్రజా పోరాటాల్లో రాజీపడని వ్యక్తి వీఎస్‌ అని చెప్పారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో తనదంటూ ఒక ముద్ర వేసిన నేత అనీ, సైద్ధాంతిక అంశాలపై రివిజననిస్టుల ధోరణిని ప్రశ్నించి పోరాడిన వారిలో ఒకరని అన్నారు. తన 17 ఏండ్ల ప్రాయంలోనే ప్రజాపోరాటాల్లో పాలుపంచుకున్నారని గుర్తుచేశారు. కేరళలో భూస్వామ్య వ్యతిరేక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పున్నప్రవాయిలార్‌ పోరాటంలో పాలుపంచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కేరళలో పేద ప్రజలకు భూములను పంచారనీ, పదిసెంట్ల ఇంటి స్థలాలను ఇచ్చారని వివరించారు. కేరళలో కమ్యూనిస్టులతో పాటు అన్ని పార్టీల, సామాజిక తరగతుల వారితోనూ గౌరవింపబడ్డ, మన్ననలు అందుకున్న మహౌన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎమర్జెన్సీ కాలంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న నేతల్లో వీఎస్‌ ఒకరన్నారు. కేరళలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కమ్యూనిస్టు ఉద్యమాన్ని తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. పలువురు ముఖ్యనేతలతో ఆయన వేసిన బీజాలే అక్కడ పార్టీ బలంగా ఉండటానికి కారణమని చెప్పారు. ఇక్కడ సుందరయ్య లాగానే కేరళలో మన్ననలు అందుకున్న ముగ్గురు, నలుగురు నేతల్లో వీఎస్‌ ఒకరన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్‌, పి.ప్రభాకర్‌, బండారు రవికుమార్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బాబూరావు, టి.స్కైలాబ్‌బాబు, పి.ఆశయ్య, ఉడుత రవీందర్‌, సీనియర్‌ నాయకులు పి.రాజారావు, అరిబండి ప్రసాదరావు, వంగూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img